ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ సిబ్బందికి.. వేతన పెంపు ఎలా?

24 Mar, 2021 08:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పీఆర్సీ సిఫారసులు అమలు చేయాలా? పాత వేతనాలపై పెంపా? 

తర్జనభర్జన పడుతున్న ఆర్థిక శాఖ  

పీఆర్సీ సిఫారసుల ప్రకారం ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాల పెంపును ఎలా వర్తింపజేయాలన్న విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంలో మరింత స్పష్టత తీసుకున్నాకే ముందుకు సాగాలని భావిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలోనూ ఆదే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,128 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, 66,239 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నారు. కనిష్టంగా రూ.12 వేల నుంచి మొదలుకొని గరిష్టంగా రూ.40,270 వరకు వీరికి వేతనాలు ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ కొత్తగా కనీస వేతనాలను నిర్ధారించింది.

అయితే పీఆర్సీ సిఫారసు చేసిన వేతనాలను వర్తింపజేయాలా? ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపును అమలు చేయలా? అన్న విషయంలో ఆర్థికశాఖ ఆలోచనలో పడింది. ఫిట్‌మెంట్‌పై సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేస్తూ... ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సహా అన్నిరకాల ఉద్యోగులకు వేతన పెంపును వర్తింపజేస్తామని చెప్పారు. అంతకుమించి వివరాల్లోకి వెళ్లలేదు. దాంతో వీరికి పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత కరువైంది. తక్కువ వేతనాలు ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మాత్రం తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపు కాకుండా, పీఆర్సీ సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తమకు పెద్దగా ప్రయోజనం చేకూరదని వాపోతున్నారు. 

మూడు కేటగిరీలుగా ఔట్‌సోర్సింగ్‌ 
ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో పని చేస్తున్న ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్‌ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్‌ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్‌ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్‌/క్యాషియర్, లిఫ్ట్‌ ఆపరేటర్లు ప్రస్తుతం నెలకు రూ. 12 వేలు మాత్రమే పొందుతున్నారు. వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్‌ సిఫారసు చేసింది. మరోవైపు రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా బేసిక్‌ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. అయితే నెలకు రూ.12 వేలు మాత్రమే పొందుతున్న కిందిస్థాయి ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తమకు పీఆర్సీ సిఫారసు చేసిన రూ. 19 వేల కనీస వేతనం కంటే ఎక్కువ ఇవ్వాలని, లేదంటే దానినైనా కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వేతనాలపై 30 శాతం పెంపుతో వేతన స్థిరీకరణ చేస్తే ఒనగూరే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందని, దాని వల్ల తమకు న్యాయం జరగదని అంటున్నారు.  

గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్‌ ఆపరేటర్, స్టోర్‌ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్‌ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్‌/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, లైబ్రేరియన్, మేనేజర్‌ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు మాత్రమే వేతనం ఉంది. వారికి కనీస వేతనం రూ.22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. మరోవైపు ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కూడా కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. వారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.  

గ్రూపు–3ఏ కేటగిరీలోని సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ స్టెనో, సీనియర్‌ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌/డీపీవోలకు ప్రస్తుతం ఆయా శాఖలు రూ. 17,500 ఇస్తున్నాయి. వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. తమకు ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంపు కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్నే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  

ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ పీఆర్సీ కొత్త వేతనాలను సిఫారసు చేసింది. తక్కువ వేతనాలున్న ఉద్యోగులు ఇపుడు తమకు వస్తున్న వేతనాలపై కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్ని చెల్లించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్‌ లెక్చరర్లు ఉన్నారు. వారికి ఇపుడు రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ.40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. అయితే వీరికి వేతనాల పెంపును ఎలా చేయాలనే విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరిపాకే ముందుకు సాగాలని భావిస్తోంది. 
 

మరిన్ని వార్తలు