చంపుతున్న చలి.. గుండె జబ్బులున్నవారు వాకింగ్‌ చేస్తున్నారా!

21 Nov, 2022 13:50 IST|Sakshi

తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దినదినం రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వణికించే చలి కారణంగా వ్యాధులు చుట్టుముట్టే అవకాశముంది. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులున్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ఉదయం, రాత్రివేళలో బయటకు వెళ్తే చర్మం పొడి బారి బిగుసుగా మారనుంది. కాళ్ల మడిమలు, పాదాలు పగులుతాయి. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి అధిగవిుంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

చర్మ సంరక్షణ ఇలా.. 
చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్‌ టేస్ట్‌ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. చలికి పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్‌బామ్‌ రాసుకోవాలి. చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్‌ సబ్బులు వాడాలి. స్నానానికి ముందు ఆలీవ్‌ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే అందుబాటులో ఉండే శనగపిండితో స్నానం చేయాలి. వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా ఉన్ని దస్తులు ధరించాలి.

బైక్‌పై వెళ్లేవారు మంకీ క్యాప్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌస్‌లు వాడాలి. ఎండకు వెళ్లాలనుకుంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. రాత్రివేళ నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనె, లేపనం రాసుకుంటే మంచిది. థైరాయిడ్‌ తరహా సమస్యలున్నవారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వ ద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహం, గుండెజబ్బులున్నవారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి.  
చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే..

పాదాలు పగిలితే.. 
చలికాలంలో చాలామందికి పాదాలు పగులుతాయి. ఉప్పునీరు కలిసిన గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటు పాదాలు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్‌ రాయాలి. విటమిన్‌–ఈ క్రీమ్‌ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు పాటించాలి.

అస్తమా ఉంటే.. 
చలికాలంలో అస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. గాలికి తిరగవద్దు. డాక్టర్‌ సలహా మేరకు మందులు, ఇన్‌హేలర్, నెబ్యులైజర్‌ లాంటివి వాడాలి.

గుండె జబ్బులుంటే.. 
చలికాలంలో గుండెజబ్బులున్న వారు, గుండె ఆపరేషన్‌ చేయించుకున్నవారు వాకింగ్‌ చేయవద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్త నాళాలు సంకోచించి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్‌ ఉన్న వారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. 

ఆహారంలో మార్పులు అవసరం 
చలికాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్‌ ‘సీ’ ఉన్న పండ్లు జలుబు, ఫ్లూ వంటి జబ్బుల నుంచి కాపాడుతాయి. మరీ పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లు ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, వంటివి త్వరగా వస్తాయి. ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి.

మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్‌ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్‌ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. మార్కెట్‌లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్‌ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి. 

జాగ్రత్తలు తప్పనిసరి
చలికాలంలో శరీరానికి వేడిచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అల్కహాలి క్‌ పానీయాలను స్వీకరించొద్దు. పొడి దుస్తులను ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలి. సూర్యోదయం తర్వాతే  జాగింగ్, వ్యా యామం చేయాలి. ఏదైన ఆరోగ్య సమ స్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                          
 – రత్నాకర్, జనరల్‌ ఫిజీషియన్, నిర్మల్‌ జిల్లా ఆస్పత్రి 

మరిన్ని వార్తలు