వినాయక చవితి: మండపాల ఏర్పాటులో జాగ్రత్తలు

6 Sep, 2021 09:54 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

 మండపాలు పకడ్బందీగా వేసుకోవాలని పోలీసుల సూచన

గణేష్‌ మండపం వద్ద కాపలాగా ఉండాలి

జాగ్రత్తలతోనే ప్రమాదాలకు చెక్‌

సాక్షి, పహాడీషరీఫ్‌: వినాయక చవితి ఉత్సవాలు అనగానే పక్షం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చిన్నారులలో వినాయక చవితి వేడుకలు పట్టలేనంతా ఉత్తేజాన్ని నింపుతాయి. ఇటు మండప నిర్వాహకులు.. అటు పోలీసు, మున్సిపాలిటీ, జలమండలి, విద్యుత్‌ విభాగాల అధికారులంతా చవితికి పక్షం రోజుల ముందు నుంచే నిమజ్జనం వరకు ఏర్పాట్లలో తలమునకలు కావాల్సి వస్తుంది. 

ఉత్సవాలను పురస్కరించుకొని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాలాపూర్, పహాడీషరీఫ్‌ పోలీసులు మండప నిర్వాహకులతో శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలను పాటించని కారణంగా ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉండటమే శ్రీరామ రక్ష అని పోలీసులు పలు సూచలను చేస్తున్నారు. 
చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్‌ చరిత్రలోనే తొలిసారి

పకడ్బందీగా మండపాల ఏర్పాటు.. 
మండపాలకు కర్రలు, ఇనుప పైప్‌లు, రేకులను నాణ్యమైన వాటిని వినియోగించి పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలన్న పోలీసుల సూచనలను మండప నిర్వాహకులు పాటించాలి. ఇలా చేయడం ద్వారా గాలి, దుమారం వచ్చినప్పుడు మండపానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గణనాథుడి వద్ద దీపాలు వెలిగిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి దగ్గరలో అగ్నికి అంటుకునే స్వభావం కలిగిన వ్రస్తాలు, పూలదండలు, అలంకరణ సామగ్రి, పెట్రోల్, కిరోసిన్‌ లాంటి వాటిని ఉంచరాదు. దీంతో పాటు విద్యుత్‌ తీగల ముందు మండపాలను ఏర్పాటు చేయరాదు. నిమజ్జనానికి తరలించే సమయంలో గణనాథుడిని వాహనంలోకి ఎక్కేంచే క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉంటుంది. అందుకే అన్ని జాగ్రత్తలు పాటించాలి.  

విద్యుత్‌ ప్రమాదాలపై ప్రధాన దృష్టి పెట్టాలి... 
మండపాల నిర్వాహకులు ఎక్కువ మంది అధికారికంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోకుండా స్తంభాలకు వైర్లను వేలాడదీస్తుంటారు. విద్యుత్‌ ప్రమాదాలు జరిగేందుకు ఇక్కడే బీజం పడుతుంది. వదులుగా ఉన్న వైర్లు గాలి, వానకు కింద పడి విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలా కాకుండా అధికారిక కనెక్షన్‌ తీసుకోవడం ద్వారా విద్యుత్‌ అధికారులు అక్కడికి వచ్చి స్తంభం నుంచి కనెక్షన్‌ను ఇస్తారు. ఏదైనా విద్యుత్‌ సమస్య తలెత్తినా వెంటనే వారు స్పందిస్తారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మంఖాల్‌లో గతంలో ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది ఈ కోవకు చెందిందే.  

భక్తిని మాత్రమే ప్రదర్శించాలి... 
వినాయక చవితి ఉత్సవాలలో నిర్వాహకులు భక్తిరసమైన పాటలను మాత్రమే పెట్టాలి. అలాకాకుండా సినిమా పాటలు పెట్టి పవిత్రతను దెబ్బతీయరాదు. దీంతో పాటు ఉత్సవాలు కొనసాగినన్నీ రోజులు నిర్వాహకులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండి పూజాది కార్యక్రమాలు చేయాలని భాగ్యనగర గణేష్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు