ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే, మీ ఇల్లు భద్రమే

11 Oct, 2021 21:24 IST|Sakshi

విలువైన బంగారు నగలు, డబ్బులు ఇంట్లో ఉంచుకోవద్దు

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ

ఇంటి భద్రతపై సైబరాబాద్‌ పోలీసుల సూచనలు

దసరాకు ఊరెళ్లే హడావుడిలో చాలా మంది ఇంటి భద్రత పట్టించుకోరు. ఇదే అదనుగా దొంగలు తమ పని కానిచ్చేస్తారు. ఇళ్లలో చొరబడి ఉన్నదంతా దోచేస్తారు. పండగ సందర్భంగా చోరీల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: ఊరెళ్లే ముందుకు ఇంట్లో ఉన్న నగలు, నగదును బ్యాంకు లాకర్‌లో పెట్టుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల్లో దాచడం వల్ల, ఎటువంటి ఆందోళన లేకుండా పండుగను సంతోషంగా జరుపుకోవచ్చని చెబుతున్నారు. 

ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు తప్పనిసరి 
ప్రయాణంలోనూ వీలైనన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు అంటున్నారు. దొంగతనాల నివారణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలి్పస్తున్నారు. ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి మైక్‌లో ప్రచారం నిర్వహించడంతో పాటుగా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. చాలా మంది సీట్లలో బ్యాగ్‌లను వదిలి తినుబండారాలు, తాగునీటి కోసం బస్సులు దిగుతుంటారు.

ఇలాంటి సమయంలో దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రయాణాల్లో మహిళలు, చిన్నారులు బంగారు ఆభరణాలు ధరించకపోవడమే మంచిదంటున్నారు. కార్లలో వెళ్లే వారు సైతం అప్రమత్తంగా ఉండాలని, దొంగలు అద్దాలు పగలగొట్టి అందులోని సామగ్రిని దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పోలీసుల సూచనలు  
► ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పీఎస్‌లో సమాచారం ఇవ్వాలి   
► ద్విచక్ర వాహనాలను ఇంటి ఆవరణలో పార్కు చేసి లాక్‌ వేయాలి   
► ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుకుని వాటిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఊరెళ్లే ముందు ఇంటి ఆవరణలో లైట్లు వేసి ఉంచాలి.  
► సోషల్‌ మీడియాలో బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్‌ చేయడం మంచిది కాదు. ఇంట్లో నమ్మకమైన వారినే సెక్యూరిటీ గార్డ్‌గా పెట్టుకోవాలి. 
► ఇంట్లో ఉండే బీరువాలు, అల్మారా, కప్‌బోర్డుల తాళాలను జాగ్రత్తగా ఉంచాలి. వీలైతే ఇంటి గేటుకు లోపల తాళం వేయడం మంచిది. ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టం తాళంను అమర్చుకోవాలి.   

ప్రత్యేక పోలీసు బృందాలు 
దొంగతనాల నివారణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. ఉదయం, రాత్రి వేళల్లో విస్తృతంగా పెట్రోల్, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం అందించాలి. ప్రయాణ సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. 
– నవీన్‌కుమార్, సీఐ షాద్‌నగర్‌

లాకర్లలో భద్రపర్చుకోవాలి 
విలువైన బంగారు నగలు, డబ్బులు ఉంటే బ్యాంక్‌ లాకర్‌లలో భద్రపర్చుకోవాలి.  దుకాణాల్లో, ఇళ్లల్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. దొంగతనాలు జరగకుండా శాఖా పరంగా ప్రత్యేక చర్యలు చేపట్టాం. చోరీల నివారణపైప్రజల్లో అవగాహనకల్పిస్తున్నాం. 
– భూపాల్‌ శ్రీధర్, సీఐ  

మరిన్ని వార్తలు