ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?.. టేప్‌ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు

6 Mar, 2023 10:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్‌ సైఫ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.

తాజాగా  ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఎలాంటి  విషపదార్థాలు  డిటెక్ట్ కాలేదని రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేసింది.  గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. దీంతో, కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఇక, ఆసుపత్రిలో ప్రీతి ఇంజెక్షన్‌ చేసుకుని ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసిందే. 

ఇక, టాక్సికాలజీ రిపోర్టుపై ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు. ప్రీతిది హత్యే అని వారు చెబుతున్నారు. ఇక, ప్రీతి సోదరుడు పృధ్వీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘ప్రీతికి నిమ్స్‌లో బ్లడ్‌ డయాలసిస్‌ చేసి, ప్లాజ్మా కూడా చేశారు. దీని వల్లే రిపోర్టులో విష పదార్ధాలు ఏమీ లేదని వచ్చింది. శరీరం మొత్తం క్లీన్‌ చేసి రిపోర్టు తీస్తే ఏం ఉంటుంది. గవర్నర్‌ రాక ముందే డయాలసిస్‌ చేశారు. మాకు తెలియని విషయాలు కూడా పోలీసులు మాకు చెప్పారు. ప్రీతి కళ్లకు టేప్‌ ఎందుకు వేశారు. ఆ నాలుగు గంటల పాటు ఏమైందో మాకు ఎందుకు చెప్పడం లేదు. మాకు ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.  ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు. 

మరిన్ని వార్తలు