ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: తండ్రి నరేందర్‌

22 Apr, 2023 15:38 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: కేఎంసీ మెడికో ప్రీతి మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న ఆమె కుటుంబ సభ్యులు.. తాజాగా ఇవాళ మరో ప్రకటన చేశారు. ఆమెది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ప్రీతి తండ్రి నరేందర్‌ మీడియా ముందు ప్రకటించారు. వరంగల్‌ సీపీతో భేటీ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. 

ప్రీతి మృతి కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఆధారంగా ఆమెది ఆత్మహత్యేనని శుక్రవారం సాయంత్రం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ ప్రకటించారు. వారం, పదిరోజుల్లో ఛార్జ్‌షీట్‌ వేయనున్నట్లు కూడా తెలిపారాయన. అయితే.. ఈ ప్రకటన తర్వాత కూడా ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు పాత మాటే చెప్పుకొచ్చారు. కానీ,  

శనివారం ప్రీతి తండ్రి నరేందర్‌, సోదరుడు పృథ్వీ  వరంగల్‌ సీపీ రంగనాథ్‌ను కలిశారు. ప్రీతి మృతిపై వాళ్ల అనుమానాలను ఆయన నివృత్తి చేసినట్లు తెలుస్తోంది.  అనంతరం బయటకు వచ్చిన వాళ్లు.. మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం. ఛార్జ్‌షీట్‌లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపాల్‌, హెచ్‌వోడీల బాధ్యతా రాహిత్యం ఉందని భావిస్తున్నాం అని ప్రీతి తండ్రి నరేందర్‌ మీడియాకు తెలిపారు. 

ప్రీతి మృతికి కారణమైన సిరంజీ దొరికింది.  ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సీపీ మాతో అన్నారు. రిపోర్ట్‌ మాత్రం చూపించలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మేం కోరాం అని ప్రీతి తండ్రి నరేందర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు