మెడికో ప్రీతి కేసు: కోర్టులో పోలీసులకు చుక్కెదురు!

8 Mar, 2023 21:22 IST|Sakshi

సాక్షి, వరంగల్: రాష్ట్రంలో సంచలనంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసు విషయమై కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. ప్రీతి మృతికి కారకుడిగా పేర్కొన్న నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు అతడిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. మరో నాలుగు రోజుల పాటు సైఫ్‌ని కస్టడీలో ఉంచేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ రెండు రోజులు వాయిదా పడింది. బుధవారం విచారించిన కోర్టు పోలీసుల పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో షాకింగ్‌ అంశాలు వెల్లడయ్యాయి. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని ఆ రిపోర్ట్  స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతిది  హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

చదవండి: ప్రీతి కేసు: కోర్టుకు సైఫ్‌.. డీజీపీ ఆఫీసుకు ప్రీతి పేరెంట్స్‌

మరిన్ని వార్తలు