పురిటిపాట్లు..

27 Jul, 2021 01:36 IST|Sakshi
ఇంట్లో ప్రసవించిన తల్లి, బిడ్డలతో 108 సిబ్బంది

వర్షాలు వస్తే ఏజెన్సీ ప్రజల్లో వణుకు 

రోడ్డు సౌకర్యాలు లేక ఇబ్బందులు 

గర్భిణులు, బాలింతలకు తప్పని తిప్పలు

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం గ్రామం.. మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాకాలం వస్తే మధ్యలో ఉన్న ఉడుముల (వట్టె)వాగు దాటి వెళ్లాలి. గత 4 రోజుల కింద గ్రామానికి చెందిన తోట రవీందర్‌ అనే యువకుడు వాగు దాటే ప్రయత్నం చేసి నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. యువకుడే వాగు దాటలేక మరణిస్తే.. ఇక మహిళలు, గర్భిణుల పరిస్థితి ఎలా ఉంటుందో..! 

‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతపెట్టిగూడెం గ్రామం నుంచి బయటకు రావాలంటే మధ్యలో ఉన్న పారేటి వాగు దాటాలి. ఈ వాగు కొద్దిపాటి వర్షానికే పొంగుతుంది. దీంతో ఇటీవల ఆ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. ఎడ్లబండిపై వాగు దాటించి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారుచెలక, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. 

సాక్షి, మహబూబాబాద్‌: వానాకాలం వస్తే చాలు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గర్భిణులకు వణుకు మొదలవు తుంది. వాగులు, వంకలు దాటి ప్రసవం కోసం ఆస్పత్రుల కు వెళ్లాలంటే కత్తిమీద సాములా మారుతోంది. నిండుచూ లాలికి నొప్పులు వస్తే వారిని ఆస్పత్రికి తరలించడం ఎంత కష్టమో చెప్పలేం. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవం, ఇతర అత్యవసర వైద్యం చేయించుకోవాలంటే ముందుగా గిరిజన గ్రామాల రహదారిపై ఉన్న వాగులు దాటితేనే వైద్యం అందుతుంది. ఇక ఆ వాగు దాటాలంటే ఎడ్లబండ్లు, జోలెలే శరణ్యం. ఇలా రాష్ట్రంలోని మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని గిరిజనులు ఇలాంటి దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో నెలలు నిండిన మొత్తం గర్భిణులు దాదాపు 3,869 మంది ఉన్నట్లు అంచనా. 

మహబూబాబాద్‌ జిల్లా గంగారం, గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్లతో పాటు నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లోని పలు గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు. ఉన్నా మధ్యలో వాగులు దాటాల్సి ఉంటుంది. దీంతో ఊట్ల మట్టెవాడ, మొట్ల తిమ్మాపురం, ముస్మి, దొరవారి తిమ్మాపురం గ్రామాలతో పాటు ఏజెన్సీలోని 10 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అవుతాయి. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంత మండలం ముల్గర నుంచి కల్వకుర్తికి వెళ్లాలంటే దుందభివాగు దాటాలి. అమ్రాబాద్‌ మండలం కుమ్మరంపల్లి నుంచి సమీప ఆస్పత్రికి వెళ్లాలంటే మధ్యలో ఉన్న మందవాగు దాటాలి. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మేడికుంట–మిట్టపల్లి మధ్య మస్మివాగు, రాఘబోయినగూడెం చెరువు అలుగు పడి ముల్కలపల్లి, బోటితండా మధ్య, ఇల్లెందు, తొడిదెలగూడెం మ«ధ్య చెరువు అలుగు పడటంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతా యి. టేకులపల్లి మండలం రోళ్లపాడు, మురుట్ల, సాయ మ్మ, గడ్డిచెరువు ముర్రేడు వాగుల్లోకి వరద నీరు భారీగా చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముత్యాలంపాడు, తావుర్యాతండా, రాజుతండా, జండాలతండా, పెట్రాంచెలక సమీపంలోని వాగుల ఉధృతితో ఈ గ్రామాల రాకపోకలకు బ్రేక్‌ పడింది. సోములగూడెం, బిక్కుతండాపై లో లెవల్‌ బ్రిడ్జి ఉంది. బూడిదవాగు పొంగితే బ్రిడ్జిపై రాకపోకలు స్తంభిస్తాయి. గుండాల మండలంలో కిన్నెరసాని వాగుపై ఉన్న లో లెవల్‌ చప్టాల కారణంగా వర్షాలు కురిసినప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశ్వాపురం–గొందిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్‌ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తే గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం, మనుబోతులగూడెం గ్రామ పంచాయతీల్లోని 8 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, తుమ్మపహాడ్, సిరికొండ, రాజులగూడ, నారాయణపూర్‌ గ్రామా లు. నేరేడుగండి, ఇంద్రవెల్లి, నార్‌నూరు, గాదిగూడ, ఉట్నూరు, బజార్‌హత్నూర్, బోథ్‌ మండలాల్లోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. 

ములుగు జిల్లాలో వాజేడు మండలంలో కొంగలవాగుల దాటితే పెనుగోడు గ్రామానికి, చాకలివాగు దాటితే వాజేడు మండల కేంద్రానికి వెళ్తారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, వెంకటాపురం–కె మండలంలో కర్రవానిగుంపు, మల్లారం గ్రామాలకు వెళ్లాంటే మద్యంలో కంకలవాగును దాటివెళ్లాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని జలగవంచతో పాటు జిల్లావ్యాప్తంగా ఇరువై గ్రామాలకు వర్షాకాలం వస్తే రోడ్డు మార్గం కూడా ఉండదు.

బయ్యారం–మొట్లతిమ్మాపురం మధ్యలో ఉన్న ఉడుము వాగును దాటుతున్న మహిళలు 

మరిన్ని వార్తలు