3 కి.మీ. మోసుకెళ్లినా దక్కని గర్భిణి ప్రాణం

23 Aug, 2021 02:36 IST|Sakshi
గర్భిణిని ఎత్తుకొని వాగు దాటుతున్న గ్రామస్తులు. (ఇన్‌సెట్‌లో)  రాజుబాయి మృతదేహం 

ఫిట్స్‌తో కుప్పకూలిన గర్భిణి 

వైద్యం కోసం 3 కి.మీ. చేతులపై తరలింపు 

ఝరికి, అక్కడి నుంచి రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మృతి 

ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలంలో ఘటన

నార్నూర్‌(గాదిగూడ): కాన్పు కోసం ఆదివారం ఉదయమే పుట్టింటికి వచ్చింది. నెల రోజులైతే చాలు పండంటి బిడ్డకు జన్మనిస్తాననే ఆలోచనలోనే ఉంది. అనుకోకుండా ఆ గర్భిణికి సాయంత్రం ఫిట్స్‌ వచ్చాయి. 108కు ఫోన్‌ చేసినా.. ఊళ్లోకి వచ్చే పరిస్థితిలేదు. దీంతో 3 కిలోమీటర్లు గర్భిణిని మోసుకెళ్లారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాదిగూడ మండలం కునికాస కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప రాజుబాయి(22)కి రెండేళ్ల క్రితం మండలంలోని పరస్వాడ(బి) గ్రామానికి చెందిన యువకుడు భీంరావుతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. ఇన్ని రోజులు అత్తగారింట్లో ఉన్న రాజుబాయి కాన్పు కోసం ఆదివారం ఉదయం భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు ఫిట్స్‌ రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్‌ చేశారు.  

చేతులపై మోస్తూ.. 
కునికాస కొలాంగూడ గ్రామ శివారులో వాగు ఉంది. అంబులెన్స్‌ గ్రామంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రాజుబాయిని 3 కిలోమీటర్ల దూరం చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లారు. జాగ్రత్తగా వాగు దాటించారు. అప్పటికే అక్కడికి 108 చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఝరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందని స్టాఫ్‌నర్సు కాంతాబాయి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో అదే అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాజుబాయి మృతిచెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండు గర్భిణి ప్రాణం పోయిందని కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించారు. 

మరిన్ని వార్తలు