గర్భిణి ప్రసవ వేదన

3 Sep, 2021 01:42 IST|Sakshi
కూరుకుపోయిన అంబులెన్స్‌ను నెట్టుతున్న గర్భిణి కుటుంబీకులు

కష్టపడి ఆస్పత్రికి వెళ్తే సిబ్బంది లేరు

సిటీకి వెళ్దామంటే బురదలో కూరుకుపోయిన అంబులెన్స్‌

వేమనపల్లి (బెల్లంపల్లి): సుఖ ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రావాలని ప్రభుత్వం చెబుతుండగా, ప్రసవ వేదనతో ఆస్పత్రికి వెళ్లిన గిరిజన మహిళ వైద్య సిబ్బంది లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం పట్టణానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే వాగు దాటలేని పరిస్థితి గర్భిణీని వేదనకు గురి చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజారాం గ్రామానికి చెందిన బోరం భీమయ్య, శాంతక్కల కూతురు బుర్స శిరీషకు బుధవారం ఇంటి వద్ద నొప్పులు మొదలయ్యాయి.

ఇరుగుపొరుగు వారి సాయంతో అవ్వాల్‌ కమిటీ అంబులెన్స్‌లో వేమనపల్లి పీహెచ్‌సీకి తరలించారు. 24 గంటల వైద్య సదుపాయం అందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది లేరు. కాంట్రాక్ట్‌ వర్కర్‌ బాపు ఒక్కడే ఉన్నాడు. శిరీష ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యాధికారి కృష్ణకు ఫోన్‌లో సమాచారం అందించగా, ఆయన చెన్నూర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించమని సలహా ఇచ్చారు. అదే అంబులెన్స్‌లో ఐదు కిలోమీటర్ల దూరంలోని నీల్వాయి వాగు వంతెన వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్‌ రోడ్డు బురదమయంగా ఉండడంతో అంబులెన్స్‌ బురదలో కూరుకుపోయింది. రాత్రి 10 గంటలకు వాగు వద్దకు వెళ్లిన అంబులెన్స్‌ రాత్రి 12.30 గంటల వరకు కూడా బురదలో నుంచి బయటకు రాలేదు.

దీంతో అంబులెన్స్‌లో ఉన్న గర్భిణిని డ్రైవర్‌ నరేష్, మరో డ్రైవర్‌ బుర్స భాస్కర్, కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకెళ్లి వంతెన మీదుగా మామిడితోట అవతలి వైపు మోసుకొచ్చారు. అక్కడ వేచి ఉన్న 108 అంబులెన్స్‌ సహాయంతో చెన్నూర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున శిరీష ఆడశిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సిబ్బంది లేకపోవడంతోనే ఆమె పరిస్థితిని చూసి అంబులెన్స్‌ ఏర్పాటు చేసి పంపించామని వైద్యాధికారి కృష్ణ తెలిపారు.   

మరిన్ని వార్తలు