రెండు గంటలు గర్భిణి నరకయాతన

10 Oct, 2021 04:12 IST|Sakshi
టాటా మ్యాజిక్‌ వాహనాన్ని తాడు కట్టి లాక్కొస్తున్న దృశ్యం. (ఇన్‌సెట్‌లో) గర్భిణి సుజాత

గ్రామానికి రోడ్డు సౌకర్యంలేక చేరుకోని 108

మధ్యలో చెడిపోయిన ప్రైవేటు వాహనం

కొత్తగూడ: గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యంలేక ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో పురిటి నొప్పులతో ఓ మహిళ రెండు గంటలు నరకయాతన పడింది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం కర్నెగండిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నెగండి గ్రామానికి చెందిన పూనెం సుజాతకు పురిటి నొప్పులు వస్తుండడంతో 108కు ఫోన్‌ చేశారు. అయితే గ్రామానికి రోడ్డు సరిగా లేనందున మెయిన్‌ రోడ్డువరకు వస్తే ఆస్పత్రికి తీసుకువెళ్తామని అంబులెన్స్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు.

దీంతో కుటుంబ సభ్యులు టాటా మ్యాజిక్‌ వాహనం మాట్లాడుకుని తీసుకువస్తుండగా అది మార్గమధ్యలో చెడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు మరో వాహనాన్ని తీసుకు వచ్చి టాటా మ్యాజిక్‌కు తాడు కట్టి మెయిన్‌ రోడ్డువరకు లాక్కుని వచ్చారు. ఇదంతా అయ్యేసరికి రెండు గంటల సమయం పట్టింది. అప్పటివరకు నొప్పులతో సుజాత నరకయాతన అనుభవించింది. అక్కడినుంచి ఆమెను అంబులెన్స్‌లో కొత్తగూడ పీహెచ్‌సీకి తరలించగా అక్కడి వైద్యులు, సహజ ప్రసవం అయ్యే పరిస్థితి లేదని చెప్పడంతో మహబూబాబాద్‌ జిల్లా అస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు