బోయిగూడ అగ్ని ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు ఇవే..

23 Mar, 2022 18:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిగూడలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి.. బీహార్‌కు చెందిన ప్రేమ్‌ కుమార్‌ బుధవారం పోలీసులకు కీలక విషయాలను వెల్లడించారు. 

ప్రేమ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్క్రాప్‌ గోడౌన్‌ యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. రెండేళ్ల నుంచి స్క్రాప్‌ గోడౌన్‌లో పనిచేస్తున్నట్టు తెలిపాడు. నిన్న రాత్రి తనతో పాటుగా మరో 11 మంది రెండు గదుల్లో నిద్రపోతున్నామని చెప్పాడు. ఓ చిన్న రూమ్‌లో తనతో పాటు బిట్టు, సంపత్‌ ఉండగా.. మరో తొమ్మిది మంది వేరే గదిలో నిద్రపోతున్నారని తెలిపాడు.

కాగా, రాత్రి 3 గంటల సమయంలో గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అన్నాడు. దీంతో కార్మికులందరూ బయటకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో తాను ఎంతో కష్టంతో కిటీకీలో నుంచి బయటకి దూకి ప్రాణాలను కాపాడుకున్నట్టు తెలిపాడు. కానీ, మిగిలిన వారంతా మంటల్లోనే సజీవ దహనమయ్యారని ఆవేదన చెందాడు. ఈ క్రమంలో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారని.. అనంతరం తనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నాడు. 

ఇదిలా ఉండగా.. ప్రేమ్‌ కుమార్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో స్క్రాప్ గోదాం ఓనర్ సంపత్ పై కేసు నమోదు పోలీసులు వెల్లడించారు. సంపత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మృతులను సికిందర్(40), బిట్టు కుమార్ రామ్(20), సత్యేందర్ కుమార్(30), చెట్టిలాల్ రామ్(28), దామోదర్(27), శింటు కుమార్(27), దుర్గా రామ్(35), రాకేష్(25), దీపక్ కుమార్ రామ్(26), పంకజ్(26), దరోగా కుమార్(35)గా గుర్తించారు. ప్రేమ్(25) ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళి సై దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు