యూఎస్‌ రోడ్డు ప్రమాదంలో ప్రేమ్‌కుమార్‌రెడ్డి మృతి.. 9 రోజుల తర్వాత స్వగ్రామానికి..

3 Nov, 2022 11:42 IST|Sakshi

సాక్షి, రామగిరి(నల్లగొండ): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి(26) అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదోరిగూడెం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌రెడ్డి  అమెరికాలోని న్యూయార్క్‌ సాక్కిడ్‌హార్డ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదవడానికి ఆగస్టు 23న వెళ్లాడు. ప్రేమ్‌కుమార్‌రెడ్డి స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా అక్టోబర్‌ 25న తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ప్రేమ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు.

స్వగ్రామంలో.. 
తిప్పర్తి మండలం గోదోరిగూడేనికి చెందిన  ప్రేమ్‌కుమార్‌రెడ్డి తల్లితండ్రులు లక్ష్మారెడ్డి లలితలు హైదారాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి హైదరాబాద్‌లో రైస్‌ బిజినెస్‌ చేస్తాడు. వీరికి  కుమారుడు, కుమార్తె ఉంది.ప్రేమ్‌కుమార్‌రెడ్డి పెద్దవాడు ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించారు. పోయి రెండు నెలలు గడవకముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

దాదాపు తొమ్మిరోజుల తర్వాత మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు ప్రేమ్‌కుమార్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా ప్రేమ్‌కుమార్‌రెడ్డి డెడ్‌బాడీని స్వగ్రామం గోదోరిగూడేనికి తరలించారు. కుటుంబ సభ్యులు బంధువుల రోదనల నడుమ బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురు ప్రేమ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు దంపతులు, మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గోదా క్రిష్ణారెడ్డి ఉన్నారు.  

మరిన్ని వార్తలు