తెలంగాణకు రానున్న రాష్ట్రపతి.. టూర్ షెడ్యూల్ ఇదే

26 Dec, 2022 01:41 IST|Sakshi

తొలిరోజున యుద్ధవీరులకు నివాళులు.. తర్వాత రాజ్‌భవన్‌లో విందు

28న భద్రాద్రి, రామప్ప ఆలయాల సందర్శన

సర్వాంగ సుందరంగా బొల్లారం రాష్ట్రపతి నిలయం ముస్తాబు

చాలా కాలం తర్వాత ఒకే చోట కలవనున్న గవర్నర్, సీఎం

సాక్షి, హైదరాబాద్‌:  శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ­నెల 30వ తేదీ వరకు హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ ఐదు రోజుల సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం తొలిరోజున బొల్లారంలో యుద్ధవీరులకు నివాళులు అర్పించనున్నారు. రాత్రి రాజ్‌భవన్‌లో  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్నారు. 

ఘన స్వాగతానికి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లు 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారని, తర్వాత పలువురు రాష్ట్ర ప్రముఖులు కూడా రాష్ట్రపతిని కలుస్తారని సమాచారం. ఈ మేరకు స్వాగత కార్యక్రమానికి హాజరుకావాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది.

కొన్నేళ్లుగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలకని సీఎం కేసీఆర్‌.. రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. అంతేగాకుండా రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఒకచోట కలవనుండటం ఆసక్తి కలిగిస్తోంది. 

సుందరంగా ఏర్పాట్లు.. బందోబస్తు 
రాష్ట్రపతి రాక నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, పరిసర ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రోడ్లను శుభ్రం చేయించి.. ఫుట్‌పాత్‌లకు రంగులు వేశారు. రాష్ట్రపతి నిలయానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నిలయం, సమీప సిబ్బంది క్వార్టర్స్, పరిసర ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక రక్షణ బృందం భద్రత పర్యవేక్షణను తమ ఆధీనంలోకి తీసుకుంది. 

భద్రాచలం, రామప్పల వద్ద భద్రతా ఏర్పాట్లు 
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్పలలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు హెలిప్యాడ్‌లను సిద్ధం చేయడం, ఆలయాలు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేయడంలో మునిగిపోయారు. 

రాష్ట్రపతి పర్యటన వివరాలివీ.. 
రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆలయాల సందర్శనతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

డిసెంబర్‌ 26న:  ఉదయం ఏపీలోని శ్రీశైలం దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్‌’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూల్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు వస్తారు. బొల్లారం వార్‌ మెమోరియల్‌లో అమరజవాన్లకు నివాళులు అర్పించి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌ విందులో పాల్గొంటారు. 

డిసెంబర్‌ 27:  హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్‌ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత సర్దార్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి వెళ్లి 74వ బ్యాచ్‌ ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌) ఆఫీసర్‌ ట్రైనీలతో సమావేశమై ప్రసంగిస్తారు. అక్కడే రక్షణశాఖకు చెందిన మిధానీ సంస్థ వైడ్ప్లేట్‌ మిల్‌ను ప్రారంభిస్తారు. 

డిసెంబర్‌ 28:  
భద్రాచలం వెళ్లి రాముడిని దర్శించుకుంటారు. ప్రసాద్‌ పథకంలో భాగంగా పర్యాటక మౌలిక సదుపాయాల పనులను శంకుస్థాపన చేస్తారు. వనవాసీ కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క–సారలమ్మ జంజాటి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభిస్తారు. వరంగల్‌ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి వెళతారు. కామేశ్వరాలయ పునరుద్ధరణతోపాటు రామప్ప ఆలయంలో మౌలిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన చేస్తారు. 

డిసెంబర్‌ 29:  
హైదరాబాద్‌లో జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (మహిళ)కు చెందిన విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖిలో పాల్గొంటారు. బీఎం మలాని నర్సింగ్‌ కళాశాల, మహిళా దక్షిత సమితికి చెందిన సుమన్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడుతారు. శంషాబాద్‌ సమీపంలోని శ్రీరామనగరంలోని సమతామూర్తి (శ్రీరామానుజాచార్య) విగ్రహాన్ని సందర్శిస్తారు. 

డిసెంబర్‌ 30:  
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన లంచ్‌ సందర్భంగా వీరనారులు, ఇతర ప్రముఖులను సన్మానిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళతారు. అయితే 30న రాష్ట్రపతి యాదాద్రికి వెళ్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.  

మరిన్ని వార్తలు