విశ్వశాంతి స్థాపనకు కృషిచేయాలి

4 Jan, 2023 01:15 IST|Sakshi
సైలెన్స్‌ రిట్రీట్‌ సెంటర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ తమిళిసై. చిత్రంలో బ్రహ్మకుమారీలు తదితరులు   

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు

వర్చువల్‌లో యాదాద్రి జిల్లాలో రిట్రీట్‌ సెంటర్‌ ప్రారంభం

బీబీనగర్‌: దేశంలోని ఎంతోమంది మహనీయులు విశ్వశాంతి స్థాపనకు పాటుపడ్డారని, వారి బాటలో శాంతిని మరింతగా విస్తరింపజేసేలా అందరూ కృషిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం మహదేవ్‌పురం గ్రామ పరిధిలో నిర్మించిన ఆధ్యాత్మిక శాంతి కేంద్రమైన బ్రహ్మకుమారీస్‌ భవనంలో సైలెన్స్‌ రిట్రీట్‌ సెంటర్‌ను రాష్ట్రపతి మంగళవారం రాజస్తాన్‌ నుంచి వర్చువల్‌ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఆధ్యాత్మిక శక్తిగల భారత్‌ను గురువుగా అంగీకరిస్తుందన్నారు. ప్రజలు శాంతిని, ఆధ్యాత్మికతను, మానవత్వాన్ని అలవర్చుకునే విధంగా బ్రహ్మకుమారీస్‌ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతోపాటు వివిధ వర్గాల వారిలో ఆధ్యాత్మికత, నైతిక విలువలు పెంపొందించేందుకు సైలెన్స్‌ రిట్రీట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు.

మారుతున్న జీవన శైలిలో మానవుడు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నాడని, దాని నుంచి ఉపశమనం పొందేందుకు మెడిటేషన్‌ టెక్నిక్స్‌ ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ... జీవితంలో మానసిక మార్పులు, చక్కని మెళకువలు నేర్పించడానికి నిశ్శబ్దం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు