సమతను చాటే భవ్యక్షేత్రం 

14 Feb, 2022 02:37 IST|Sakshi
రామానుజుల విగ్రహం వద్ద  కుమార్తెతో రాష్ట్రపతి కోవింద్‌ దంపతులు. చిత్రంలో గవర్నర్‌ తమిళిసై, చినజీయర్, మంత్రి తలసాని, ఏపీ ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు తదితరులు 

గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందన్న కోవింద్‌

భార్య, కుమార్తెతో కలసి రామానుజుల సహస్రాబ్ది వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరు

120 కిలోల స్వర్ణమయ మూర్తి లోకార్పణం.. తొలి పూజలు  

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుపై రాష్ట్రపతి ప్రశంసలు 

సాక్షి, హైదరాబాద్‌: వెయ్యేళ్ల కింద సమానత్వ భావనతో సామాజిక పరివర్తన దిశగా శ్రీరామానుజాచార్యులు వేసిన అడుగును బలోపేతం చేసే దిశగా ఆయన విరాట్‌మూర్తితో భవ్యక్షేత్రంగా అవతరించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చైతన్యం నింపుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. అత్యద్భుతంగా రూపొందించిన ఈ కేంద్రం దేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో కీలకమైన వసుదైక కుటుంబం స్ఫూర్తిని రామానుజుల ఆలోచనలు ప్రతిబింబిస్తాయని, జాతి కల్యాణంలో ఇప్పుడు రామానుజుల స్ఫూర్తి కేంద్రం కూడా ఆ పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం సాయంత్రం ముచ్చింతల్‌లోని రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల శ్రీరామానుజాచార్యుల స్వర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ లోకార్పణం చేశారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు, వారి కుమార్తె తొలి పూజ నిర్వహించారు. అనంతరం ప్రవచన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ రామానుజుల భవ్యక్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించి చినజీయర్‌ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రామానుజుల స్వర్ణమయ మూర్తిని జాతికి అంకితం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1035 కుండాలతో నిర్వహించిన లక్ష్మీనారాయణ హోమం, 108 దివ్యదేశాల ప్రాణప్రతిష్టతో ఈ మహా క్షేత్రానికి గొప్ప ఆధ్యాత్మిక శోభ ఏర్పడిందని అన్నారు. 

స్ఫూర్తికేంద్రం సమతాభూమి... 
సమానత్వం కోసం పరితపించిన శ్రీరామానుజాచార్యులు వెలసిన ఈ క్షేత్రాన్ని తాను భక్తి భూమి, సమతాభూమి, విశిష్టాద్వైతాన్ని సాక్షాత్కరింపజేసే భూమిగా, దేశ సంస్కారాన్ని తెలిపే భూమిగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. వందేళ్లను మించిన తన జీవనయాత్రతో భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక భావనకు కొత్త రూపమిచ్చిన రామానుజులు, సామాజిక భేదభావాలకు అతీతంగా దేవుడిని అందరి దరికి చేర్చి భక్తిప్రపత్తి, తాత్వికతను సామాజిక జీవన సౌందర్యంతో జోడించి కొత్త భాష్యం చెప్పారని కీర్తిం చారు.

తక్కువ కులం వారుగా ముద్రపడ్డ వ్యక్తులు చేసిన రచనలను ఆయన వేదంగా గౌరవించారన్నారు. రామానుజులు దక్షిణాది నుంచి భక్తిధారను ఉత్తరాదికి ప్రవహింపజేసి ఎందరో ముక్తి పొందేలా చేశారని కోవింద్‌ పేర్కొన్నా రు. వారిలో ఎంతోమంది తక్కువ జాతిగా ముద్రపడ్డ వారేనని రాష్ట్రపతి తెలిపారు.

రామానుజుల తత్వంతో అంబేడ్కర్‌... 
‘రామానుజ తత్వంతో ప్రేరణ పొందిన కబీర్‌పంత్‌ను అనుసరించిన అంబేడ్కర్‌ కుటుంబీకులు జీవించిన మహారాష్ట్రలోని వారి గ్రామాన్ని నిన్న సందర్శించా. ఈరోజు శ్రీరామనగరంలోని ఈ క్షేత్రంలో ఉన్నా. ఈ రెండూ పవిత్ర తీర్థ స్థలాలుగానే నాకు అనిపిస్తాయి. అప్పట్లో సమత మంత్రంగా రామానుజులు పరివర్తన కోసం పరితపిస్తే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సామాజిక న్యాయం కోసం పనిచేశారు. రామానుజుల తత్వాన్ని అంబేడ్కర్‌ కూడా ప్రస్తుతించారు. మనలో ఇమిడి ఉన్న వసుదైక కుటుంబానికి ఈ సమతనే ప్రేరణ’అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.

అన్ని వర్గాల పురోగతి అనే భావన రామానుజులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతంలోని భక్తిభావంలో ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. రామానుజుల సమానత్వ స్ఫూర్తిని మహాత్మాగాంధీ అనుసరించారని, జైలువాసంలో ఉన్నప్పుడు ఆయన రామానుజుల చరిత్రను చదివి ఎంతో ప్రేరణ పొందారని గుర్తుచేశారు. స్వామి వివేకానందపై కూడా రామానుజుల ప్రభావం ఎంతో ఉందని, ఆయన రచనల్లో రామానుజులను గుర్తుచేశారని అన్నారు. 


సమతా స్ఫూర్తి కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. చిత్రంలో ఆయన సతీమణి సవిత, గవర్నర్‌ తమిళిసై, చినజీయర్‌ స్వామి, మంత్రి తలసాని, మైహోం రామేశ్వరరావు

భారీ ప్రతిమ... దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నం 
ఓ శ్లోక తాత్పర్యం ప్రకారం విష్ణువుకు సోదరులుగా వివిధ కాలాల్లో పుట్టిన వారి ప్రస్తావన ఉందని రాష్ట్రపతి గుర్తుచేశారు. దాని ప్రకారం తొలుత ఆదిశేషుడిగా, త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, కలియుగంలో రామానుజులుగా అవతరించారని అందులో ఉన్నట్లు ఆయన తెలిపారు. కలియుగంలో ముక్తి మార్గాలు మూసుకుపోయినప్పుడు రామానుజులు భక్తి, ముక్గి మార్గాన్ని చూపిన తీరును అన్నమాచార్యులు పలు కీర్తనల్లో ప్రస్తావించారన్నారు.

పంచ లోహాలతో రూపొందిన రామానుజుల విరాట్‌మూర్తిని చూస్తే అది ఒక విగ్రహం మాత్రమే కాదని, దేశ సంప్రదాయ వైభవానికి ప్రతిరూపమని, సామాజిక సమానత్వ భావనను సాకారం చేసే కలకు నిలువెత్తు రూపమని, దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నమని కోవింద్‌ కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులను శాలువా, రామానుజుల జ్ఞాపికతో చినజీయర్‌ స్వామి సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, రామానుజుల సహస్రాబ్ది సమారోహం ప్రతినిధులు జూపల్లి రామేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు