పప్పు.. నిప్పు! 

31 May, 2023 01:57 IST|Sakshi

రూ. 120 నుంచి 150 వరకు చేరిన కందిపప్పు ధర 

రూ. 70 నుంచి రూ. 100 దాటిన ఎర్రపప్పు 

పల్లీల ధరకూ రెక్కలు.. కిలోకు రూ. 90 నుంచి రూ. 130కి జంప్‌ 

మార్కెట్లో నెల వ్యవధిలోనే భారీగా పెరిగిన ధరలు 

సూపర్‌ మార్కెట్లు, ఆన్‌లైన్‌ ప్యాకేజ్డ్‌ పప్పులపై మరింత వడ్డింపు 

దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల దిగుబడి తగ్గడం వల్లే..: వ్యాపార వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌: వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది.

అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్‌ దాల్‌) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. వేరుశనగ (పల్లీలు) ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. కేవలం పెసరపప్పు ధరలో మాత్రమే పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సూపర్‌ మార్కెట్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్‌ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది.

అలాగే ఆర్గానిక్‌ పేరుతో ప్యాక్‌ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. ఈ కేటగిరీలో మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా విక్రయిస్తున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాల, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది. 

దిగుబడి తగ్గడం, డిమాండ్‌ పెరగడం వల్లే.. 
దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్‌ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వాతా వరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలకుతోడు పప్పుధాన్యాలు, వేరుశనగతో పోలిస్తే తక్కువ శ్రమతో చేతికందే ఇతర పంటల సాగు వైపు రైతు లు మొగ్గుచూపడం వల్లే దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనితాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గినట్లు చెబుతున్నాయి. 

స్టాక్‌.. బ్లాక్‌ మార్కెట్‌కు? 
పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్‌’బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్‌ మార్కెట్‌కు తరలే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల త్వరలోనే కందిపప్పు ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు