Pride Place: దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

13 Apr, 2022 04:21 IST|Sakshi
ప్రైడ్‌ ప్లేస్‌ లోగోను ఆవిష్కరిస్తున్న డీజీపీ 

ప్రైడ్‌ ప్లేస్‌ పేరుతో ఏర్పాటు

సాక్షి,హైదరాబాద్‌: ట్రాన్స్‌జెండర్స్‌ రక్షణ కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రైడ్‌ ప్లేస్‌’పేరుతో దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం లక్డీకపూల్‌లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో‘ప్రైడ్‌ ప్లేస్‌’లోగోను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడంలో ‘ప్రైడ్‌ ప్లేస్‌’చాలా ఉపయోగపడుతుందన్నారు.

వివక్షకు గురికాకుండా వారి రక్షణకు అన్ని చర్యలను ఈ సెల్‌ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కొంతమంది కానిస్టేబుళ్లు బృందంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రత్యేక సెల్‌ ఎప్పటికప్పుడు సంబంధిత కమ్యూనిటీతో చర్చలు జరుపుతూ రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో అధికారులకు, సిబ్బందికి రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. 2019లో ట్రాన్స్‌జెండర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ప్రకారం ఈ సెల్‌ ఏర్పాటుకు కృషి చేసిన మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి, తరుణి ఎన్‌జీవో బాధ్యులు మమతా రఘువీర్, ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ ప్రతినిధులను డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.  

మరిన్ని వార్తలు