చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే..

8 Oct, 2022 10:40 IST|Sakshi
ప్రసాద్‌ (ఫైల్‌), అమ్మవారి విగ్రహం 

సాక్షి, జగిత్యాల: నవరాత్రులు అమ్మవారికి నిత్యపూజలు చేశాడు.. ఆమె ధ్యాసలోనే గడిపాడు.. కాలువలో జారిపడినా.. ఆ దేవతా విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.. చివరిశ్వాస వరకూ అమ్మవారినే నమ్ముకుని తన ప్రాణాలు అర్పించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో బుధవారం గల్లంతైన పూజారి సుమారు పది కిలోమీటర్ల మేర అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టక కొట్టుకుపోయాడు..

గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన పూజారి బింగి ప్రసాద్‌(46) ఈనెల 5న దుర్గాదేవి నిమజ్జనం కోసం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లాడు. తొలుత ఇటీవల ఓ భక్తుడు సమర్పించిన వెండి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు కాలువలోకి దిగాడు. విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన యువకులు కాలువలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. తర్వాత పూజారి కోసం శుక్రవారం వరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. ఈక్రమంలో చొప్పదండి మండలం రేవల్లెలో ఎస్సారెస్పీ కాలువ గేట్ల వద్ద పూజారి శవమై కనిపించాడు.

పది కి.మీ. అమ్మవారి విగ్రహంతోనే..
ప్రసాద్‌ రెండు దశాబ్దాలుగా పౌరోహిత్యం చేస్తున్నారు. జాతకాలు చూస్తున్నారు. వాస్తుదోషంలోనూ ఆరితేరాడు. కరీంనగర్, వరంగల్, ధర్మపురి వంటి దూరప్రాంతాల ప్రజలకూ సుపరిచితులు. తాటిపల్లి మార్కండేయ ఆలయంలో దశాబ్దకాలంగా అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేస్తున్నాడు. నిత్యం అమ్మవారి ధ్యానంలోనే ఉంటున్నాడు. ఉపవాస దీక్ష చేపడుతూ ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నాడు.

ఈక్రమంలో ఎస్సారెస్పీ కాలువలో జారిపడి సుమారు 10కి.మీ. మేర కొట్టుకుపోయినా చివరిశ్వాస వరకూ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టలేదు. పాక్షికంగా ఈత వచ్చినా, అమ్మవారి ఒడిలో చివరిశ్వాస విడిచాడు. స్థానికులు రేవల్లె వద్ద మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ప్రసాద్‌కు నడుముకు అమ్మవారి విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహానికి రేవల్లె వద్ద పోస్టుమార్టం నిర్వహించి, తాటిపల్లికి తరలించి, దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య మంజుల, కూతురు, కుమారుడు ఉన్నారు. 

మరిన్ని వార్తలు