ఈ నత్త గుళ్లల వయసు ఆరున్నర కోట్ల ఏళ్లు..

31 Jul, 2021 02:47 IST|Sakshi

ఆసిఫాబాద్‌ అడవుల్లో గుర్తింపు 

‘ప్రిహా’పరిశోధనలో వెలుగులోకి.. 

సాక్షి, హైదరాబాద్‌: ఈ చిత్రంలోని నత్తగుళ్లల వయసు ఎంతో తెలుసా..? ఏకంగా ఆరున్నర కోట్ల సంవత్సరాలు. ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధారి అటవీ రేంజ్‌ పరిధిలోని గోయెనా గుట్టల మీద ఈ నత్తగుల్లల శిలాజాలను గుర్తించారు. ‘పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్‌ హెరిటేజ్‌ (ప్రిహా)’ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్, ఫారెస్టు రేంజ్‌ అధికారి, ప్రిహా సభ్యుడు టి.ప్రణయ్, సిబ్బంది తాజాగా వీటిని గుర్తించారు. గతం లో ఈ ప్రాంతంలో మంచినీటి సరస్సు ఉండేదని, భూమి పొరల నుంచి లావా ఉబికి ఆ సరస్సు ప్రాం తాన్ని కమ్మివేయటంతో అందులోని జీవరాశులు ఇలా శిలాజాలుగా మారి ఉంటాయని శ్రీనివాసన్‌ అభిప్రాయపడ్డారు. 

30 ఏళ్ల తర్వాత.. 
సంగారెడ్డి జిల్లా తేర్పోల్‌ శివారులో 30 ఏళ్ల కిందట జియాలజిస్టు అయ్యస్వామి పరిశోధించి ఈ తరహా నత్త శిలాజాలను గుర్తించారు. దీంతో వాటిని ఆ గ్రామం పేరుతో ‘పైజా తిర్పోలెన్సిస్‌’ అని నామకరణం చేశారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన నత్త శిలాజాలు కూడా అదే ప్రజాతికి చెందినవని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చకిలం వేణుగోపాలరావు నిర్ధారించినట్టు శ్రీనివాసన్‌ తెలిపారు. ఈ 3దశాబ్దాల కాలంలో ఇప్పటివరకు స్థానికంగా మరెక్కడా నత్త శిలాజాలు వెలుగు చూడలేదని పేర్కొన్నారు. 

అప్పుడు ఎడమ.. ఇప్పుడు కుడి.. 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నత్తగుళ్లలు కుడివైపు తెరుచుకుని కన్పిస్తుంటాయి. అరుదుగా మాత్రమే ఎడమవైపు తెరుచుకుంటాయి. ఈ శిలాజాల్లో మాత్రం ఎడమవైపు తెరుచుకుని ఉన్నాయి. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో నత్త శిలాజాలుండటం విశేషం. ఒకే రాతి ముక్కలో 18 నత్తగుళ్లలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగా ఇది సరస్సు ఉండే ప్రాంతమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో పొడవైన సున్నపురాతి గుహలను కూడా గుర్తించారు.

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గతంలో ఇక్కడ పరిశోధనలు చేసి ఎన్నో శిలాజాలను గుర్తించింది. వెరసి ఈ ప్రాంతాన్ని ఫాజిల్‌(శిలాజ) పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దీనివల్ల శిలాజాల చరిత్రను భావితరాలు తెలుసుకునేందుకు అవకా శం చిక్కుతుందని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా అటవీశాఖ అధికారి శాంతారం, ఎస్డీవో దినేశ్‌ ప్రోత్సాహంతో ఈ శిలాజాలను గుర్తించినట్టు అటవీ శాఖ అధికారి ప్రణయ్‌ పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు