రెండేళ్లలో మోడ్రన్‌ జైలును నిర్మిస్తాం: రాజీవ్‌ త్రివేది

1 Jun, 2021 15:28 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లోని సెంట్రల్‌ జైలుని మంగళవారం జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది సందర్శించారు. కాగా గతంలో కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన సందర్భంగా సెంట్రల్‌ జైలు స్థానంలో ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే వరంగల్‌ సెంట్రల్‌ జైలును వేరే చోటికి తరలిస్తున్నారు. దీనిలో భాగంగా ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్తున్నట్లు రాజీవ్‌ త్రివేది పేర్కొన్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' ప్రస్తుతం ఈ జైలులో 956 మంది ఖైదీలు, 2,667 మంది సిబ్బంది ఉన్నారు. ఇవాళ మొత్తం 119 మంది ఖైదీలను తరలిస్తున్నారం. 15 రోజుల్లోగా ఖైదీల తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. త్వరలో వరంగల్ సెంట్రల్ జైలును వేరొకచోట మోడ్రన్ జైల్‌‌గా నిర్మిస్తాం. కొత్త జైలు నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండేళ్లలోగా ఆధునిక టెక్నాలజీతో కొత్త జైలును మోడ్రన్‌ జైలుగా నిర్మాణం చేపడతాం. ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, సెంట్రల్ జైల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్  త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.'' అని రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు