డగ్రీ అక్రమ ప్ర‘వేషాలు’

28 Aug, 2020 12:43 IST|Sakshi

‘కరీంనగర్‌ పట్టణ ప్రైవేటు కళాశాల నిర్వాహకులు పట్టణంలోని పాతబజార్‌ ప్రాంతానికి చెందిన ఇంటర్‌ పాసైన ఒక విద్యార్థిని ఇంటికి వెళ్లారు. వారి కళాశాలలో ప్రవేశం తీసుకుంటే వారు ఇస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఆమ్మాయి ఫోన్‌నంబర్‌ తీసుకొని వెళ్లారు. ఇదే పద్ధతిలో నగరానికి చెందిన మరో రెండుకళాశాల వారు రవాణా ఉచితమని, ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని కేవలం ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌తోపాటు సర్టిఫికెట్లు ఇస్తే తామే చూసుకుంటామని చెప్పారు. కోర్సు పూర్తయ్యే వరకు నాదే బాధ్యతని కళాశాల అధ్యాపకుడు హామీ కూడా ఇచ్చాడు. ఆఫర్లు విన్న విద్యార్థిని, తల్లిదండ్రులు సర్టిఫికెట్లు ఇచ్చేశారు.’ ఇది ఈ ఒక్క అమ్మాయి విషయం కాదు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని చాలావరకు కళాశాలలు ప్రవేశాల సమయంలో పాటిస్తున్న పద్ధతి.

సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్‌): దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు ఇటీవల ప్రకటన వెలువడడంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. ప్రభుత్వం పారదర్శకంగా డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలనే లక్ష్యానికి పలు కళాశాలలు తూట్లు పొడుస్తూ అక్రమంగా అడ్డదారిలో ప్రవేశాలుపొందే పనిలో నిమగ్నమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని తమ కళాశాలల్లో నింపుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. నగదు, బహుమతులు వంటి విద్యార్థులకు ఆఫర్‌ చేస్తూ ప్రవేశాల పారదర్శకతకు మసి పూస్తున్నాయి. కమిషన్‌ విధానంలో పీఆర్‌వోలను, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు సిబ్బందిని సీట్లు నింపే ప్రక్రియలో ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ ఉంటే చాలు
శాతవాహన యూనివర్సిటీలో 90 ప్రైవేటు కళాశాలలుండగా ఇందులో 36410  సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ప్రవేశాల కారణంగా వివిధ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మధ్య తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ నెలకొంది. పలు కళాశాలలు అయితే సీట్లు ఖాళీ ఉంచుకునే బదులు కొంతనైనా లాభపడవచ్చనే ధోరణితో ఆదాయ ధ్రువపత్రం తీసుకొస్తేచాలు అంతా మేమే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. మరికొందరు కళాశాలకు వచ్చే  విద్యార్థులకు బస్సుల ద్వారా రవాణా ఉచితమని, ఇంకొందరు నగదు, సెల్‌ఫోన్లు, వివిధ రకాల బహుమతులతో ప్రలోభపెడుతూ అడ్మిషన్లు ‘కొని’తెచ్చుకుంటున్నారు. అడ్మిషన్‌ తీసుకునే వరకూ ఒకమాట చివరగా పరీక్షల సమయంలో హాల్‌టికెట్‌ ఇచ్చేందుకు నానా తిప్పలు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి కళాశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టిపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఫ్రీగా ఇస్తున్నారని జాయిన్‌ కావొద్దు
కళాశాలలు ఫ్రీగా ప్రవేశాలిస్తున్నాయని వెళ్తే తర్వాత నాణ్యత ప్రమాణాలు లేక భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్తుందని గుర్తించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆలోచించి మంచి నాణ్యత ప్రమాణాలు ఉన్న కళాశాలల్లో చేర్పిస్తేనే బంగారు భవిష్యుత్‌ ఉంటుందని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా కళాశాలలో ప్రవేశాలు తీసుకునేముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను సంప్రదించి అందులోని సదుపాయాలు, విద్యాప్రమాణాలు లోతుగా తెలుసుకొని ప్రవేశాలు పొందితే మంచి భవిష్యత్‌ ఉంటుందని  నిపుణులు సూచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు