తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులివ్వండి 

24 Mar, 2023 03:18 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల మొర 

సాక్షి, హైదరాబాద్‌:  ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ కష్టంగా ఉందని ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం ఇక్కడి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు స్థాపించిన కాలేజీలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ కాలేజీల్లో 9.40 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రూ.86.55 కోట్లు ట్రెజరీకి విడుదలైనా ప్రైవేట్‌ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వలేదని, 2022–23 సంవత్సరానికి రూ.226 కోట్లు ఇంకా విడుదల చేయలేదన్నారు. దీనివల్ల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మౌలిక వసతులులేవని వేధించే ప్రభుత్వం, తమకు రావాల్సిన బకాయిలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గడచిన ఎనిమిదేళ్లలో కాలేజీలపై వివిధ రకాల ఫీజులను 10 నుంచి 50 శాతం పెంచారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం ఆ నిష్పత్తిలో పెంచలేదన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఇంద్రసేనరెడ్డి, ఉస్మాన్, ఎస్‌ఎన్‌ రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు