మూడు వారాలు.. మూడింతలు

22 Aug, 2020 03:55 IST|Sakshi

విరివిగా పెరిగిన ప్రైవేట్‌ కరోనా ఆసుపత్రుల సంఖ్య 

జూలై 28న 55 ఆసుపత్రులు.. ఇప్పుడు 167 

నాడు వాటిల్లో కరోనా బెడ్స్‌ 4,497.. నేడు రెట్టింపు 

అనుమతిపై సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌తో దరఖాస్తుల వెల్లువ 

ప్రభుత్వ పడకలకు మించి ప్రైవేట్‌లో పెరిగిన సామర్థ్యం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్స చేసే ప్రైవే ట్‌ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం మూడు వారాల్లోనే మూడింతలు పెరగడం గమనార్హం. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు అనుమతులు ఇవ్వాలని, ఆ మేరకు దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా చికిత్స చేయగలిగే అవకాశం కలిగిన ఆసుపత్రులు దరఖాస్తు చేసుకుంటున్నాయి. అనంతరం ప్రభుత్వం వాటికి అనుమతులు ఇస్తోంది. జూలై 28 నాటికి ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంది. అయితే శుక్రవారం నాటికి ప్రైవేట్‌ ఆసుపత్రుల సంఖ్య 167కి చేరుకోగా, వీటిల్లో మొత్తం కరోనా పడకల సంఖ్య 9,048కు పెరిగింది. మరోవైపు ప్రస్తుతం 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటిల్లో 7,952 కరోనా పడకలు ఉన్నాయి. 

తీరిన పడకల కొరత... 
ప్రైవేట్‌ ఆసుపత్రులకు విరివిగా అనుమతులు ఇవ్వడంతో రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన పడకల కొరత తీరినట్లేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా కరోనా వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన కరోనా వైద్యం ఇప్పుడు జిల్లాలకూ చేరడంతో బాధితులకు ఊరట కలుగుతుందని అంటున్నారు. అంతేగాక ఆసుపత్రుల్లో తక్కువ ఫీజులకే కరోనా వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం ఫీజుల విషయంలో ఇంకా కఠినంగానే ఉంటున్నాయని బాధితులు చెబుతున్నారు.  

జూలై 28 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు ఇలా.. 
► మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు: 57 
► వీటిలో మొత్తం పడకలు: 8,446  
► సాధారణ పడకలు: 2,532 
► ఆక్సిజన్‌ బెడ్లు: 4,663 
► ఐసీయూ బెడ్లు: 1,251  

మొత్తం ప్రైవేట్‌ ఆసుపత్రులు: 55
► వీటిలో మొత్తం పడకలు: 4,497  
► సాధారణ పడకలు: 2,010 
► ఆక్సిజన్‌ బెడ్లు: 1,676  
► ఐసీయూ బెడ్లు: 811  

శుక్రవారం నాటికి కరోనా బెడ్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో... 
► మొత్తం పడకలు: 7,952 
► చికిత్స పొందుతున్న బాధితులు: 2,385 
► ఖాళీగా ఉన్న బెడ్లు: 5,567  

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో... 
► మొత్తం పడకలు: 9,048 
► చికిత్స పొందుతున్న బాధితులు: 3,970 
► ఖాళీగా ఉన్న బెడ్లు: 5,078 
► ఖాళీ వాటిలో సాధారణ పడకలు: 1,844  
► ఆక్సిజన్‌ బెడ్లు: 2,197  
► ఐసీయూ బెడ్లు: 1,037 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు