ఏం పర్లేదు.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఇక్కడ!‌

18 Mar, 2021 07:59 IST|Sakshi
అధికారులు మూసివేయించిన ఆస్పత్రి (ఫైల్‌)

 జిల్లాలో ‘ప్రైవేట్‌’ దోపిడీ

నిర్వహణ ప్రైవేట్‌ వ్యక్తులది.. చికిత్స వైద్యులది

ప్రజల రోగాలే పెట్టుబడిగా ముందుకు..

వైద్యం పేరిట ప్రైవేట్‌ క్లినిక్‌లు..

తనిఖీలు మరిచిన వైద్యారోగ్యశాఖ 

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని స్టేషన్‌రోడ్డులోని ఓ మహానీయుని పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండానే వైద్యం నిర్వహించారు. పరిశీలించేందుకు అధికారులు ఆస్పత్రికి రాగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అక్కడ లేరు. తీరా ఆరా తీస్తే నిర్మల్‌లో ఓ వైద్యుడి దగ్గర పనిచేసిన వ్యక్తి ఆ వైద్యుడి సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. ఆ వైద్యుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పని చేస్తున్నాడు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని మూసివేయించారు. ఏ వైద్యుడి పేరిట ఆస్పత్రి కోసం దరఖాస్తు చేశారో ఆయనకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. 

ఏడాది కిందట రాంనగర్‌లో ఓ ఆర్‌ఎంపీ క్లినిక్‌ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నాడు. ఏకంగా పడకలు ఏర్పాటు చేసి సెలూన్‌ బాటిళ్లు సైతం ఎక్కిస్తున్నాడు. ఆ ఆర్‌ఎంపీ తన పేరు కింద ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్లు రాసుకున్నాడు. ఈ విషయం కొంత మంది వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు వైద్య పట్టా అడగడంతో ఆ నకిలీ వైద్యుడి బాగోతం బట్టబయలైంది. ఇలా చాలా మంది ఆర్‌ఎంపీలు ఎంబీబీఎస్‌ వైద్యులు అందించే వైద్యం అందిస్తామని చెప్పడం విశేషం. వీరిలో కొంత మంది ఆపరేషన్లు చేయిస్తామని చెప్పడమే కాదు.. ప్రైవేట్‌ వైద్యుల దగ్గరకు పంపి వారి నుంచి కమిషన్లు కూడా తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. 

సాక్షి. ఆదిలాబాద్‌‌:  వైద్య విద్య చదవకపోయినా ఫర్వాలేదు.. ఎంబీబీఎస్‌ పట్టా, పలుకుబడి, డబ్బులుంటే చాలు ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. తెలిసిన డాక్టర్‌కు చెందిన పట్టాను తీసుకువెళ్లి క్లినిక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వైద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించకుండా అనుమతి ఇవ్వడంతో కొంతమంది వైద్యం పేరిట దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ తతంగం జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో ప్రైవే ట్‌ క్లినిక్‌ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ప్రజల అనారోగ్యాలే పెట్టుబడి ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైద్య పరీక్షల పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు. 

ప్రజల ఆరోగ్యమే పెట్టుబడిగా..
ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 100 ప్రైవేట్‌ క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో 12 నర్సింగ్‌ హోంలు, 12 క్లినిక్‌లు, 16 డెంటల్‌ క్లినిక్‌లు, 5 కంటి ఆసుపత్రులు, 44 ఆసుపత్రులు, 11 ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవల జిల్లాలో ఆస్పత్రుల సంఖ్య పుట్టగొడుగుల్లా పెరిగాయి. కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులు వైద్య వ్యాపారం చేస్తున్నారు. రిమ్స్‌ ఆసుపత్రిలో పని చేస్తున్న కొంతమంది వైద్యులతో పాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు చెందిన వారితో ఒప్పందం చేసుకొని క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకున్న వైద్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ ఆ ఆస్పత్రి మాత్రం అలాగే కొనసాగుతోంది. అలాగే అర్హతలు లేకపోయినా మెడికల్‌ షాపుల, ల్యాబ్‌ల నిర్వహణ చేపడుతున్నారు.  వైద్యుడు వారానికి ఓసారి రావడం, ఫోన్ల ద్వారానే రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వైద్యం అందిస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. 

టెస్ట్‌ల పేరిట దోపిడీ.. 
ఆస్పత్రికి రోగి వెళ్లిన వెంటనే మొదట పరీక్షల పేరిట దోపిడీ చేస్తున్నారు.  ల్యాబ్‌లో అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయించడం, ల్యాబ్‌ టెక్నిషియన్‌ కోర్సు పూర్తి చేయకపోయిన.. ల్యాబ్‌లో పని చేసి నేర్చుకున్న వారే టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆ పీహెచ్‌సీల్లో, రిమ్స్‌లో పని చేసే ల్యాబ్‌ టెక్నిషీయన్లు ప్రైవేట్‌ ఆస్పత్రి ల్యాబ్‌లో పనులు చేస్తున్నారు. 

తనిఖీలు నామమాత్రం..
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నామమాత్రంగా చేయడంతో ప్రైవేట్‌ క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. అందినకాడికి ఫీజులు వసూలు చేయడం, అనవసర మందులు కొనుగోలు చేసే విధంగా చూస్తున్నారు. రోగి ప్రాణభయంతో గత్యంతరం లేక డబ్బులు దారపోస్తున్నారు. మూడు నెలలకోసారైన వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అక్కడ ఏ విధంగా వైద్యం అందుతుంది.. వసతులు ఉన్నాయా.. లేదా.? వైద్యుడు ఉన్నాడా లేడా.? అనే అంశాలపై అరా తీయాలి. కానీ ఇవేమి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు పుట్టుకొస్తున్నారు. 

బృందం ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తాం
జిల్లాలోని ఆన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో వంద ప్రైవేట్‌ ఆస్పత్రులున్నాయి. వీటిన్నింటీని తనిఖీ చేస్తాం. ఇందుకు బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న వైద్యులు ఉన్నారా లేదా.? అర్హత గల ల్యాబ్‌ టెక్నిషీయన్‌ ఉన్నారా.. లేదా? అనేది చూస్తాం. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి. గ్లూకోజ్‌లు, ఇంజక్షన్లు వేయకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు ఉన్న వారే ఆస్పత్రులు నిర్వహించాలి. 
– నరేందర్‌ రాథోడ్, డీఎంహెచ్‌వో 

అనవసర టెస్ట్‌లు చేస్తున్నారు
నాకు ఇటీవల ఆరోగ్యం బాగా లేక ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాను. అంతంత మాత్రంగానే జ్వరం ఉన్నా.. అన్ని టెస్ట్‌లు చేశారు. దాదాపు రూ.3వేలు ఖర్చు అయింది. టెస్ట్‌లు అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు వచ్చాయి. అనవసరంగా పరీక్షలు నిర్వహించారు.
 – శ్రీనివాస్, తలమడుగు  

మరిన్ని వార్తలు