ప్రైవేట్‌ విద్యాసంస్థలు బాధ్యత మరవొద్దు

7 Sep, 2020 03:15 IST|Sakshi

ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జీతాలు చెల్లించాలి: వినోద్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి విధిగా ప్రతి నెలా జీతాలు చెల్లించే నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలపై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రైవేట్‌ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్‌ కుమార్‌ను ఆయన అధికారిక నివాసంలో ఆదివారం కలిశారు. తమ సమస్యలు వివరించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయ, అధ్యాపకులకు విద్యా సంస్థలు జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే తెలంగాణ విద్యాచట్టం–82లో సవరణలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెలా ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆయా విద్యాసంస్థల యజమానులు కచ్చితంగా నెలవారీ జీతాలు చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినోద్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐనేని సంతోష్‌ కుమార్, ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ ఉమాదేవి, కార్యదర్శులు రాజు, నరేశ్, మదన్‌ తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు