153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్‌ కాలేజీల వినతి

4 Nov, 2022 02:19 IST|Sakshi

భారీగా మిగిలిపోయిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ సీట్లు  

కొన్ని సెక్షన్లలో ఐదుగురు కూడా లేని దుస్థితి  

10 మంది లోపు ఉన్న 153 సెక్షన్ల మూతకు ఒత్తిడి 

సాక్షి, హైదరాబాద్‌: తమ కాలేజీల్లో కొన్ని సెక్షన్లు రద్దు చేయాలంటూ కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సులకు సంబంధించిన సెక్షన్లున్నాయి. 58 కాలేజీలు ఈ విధంగా అభ్యర్థించడం గమనార్హం. ఈ తరహా కాలేజీలు గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా ఉంటే, హైదరాబాద్‌ నగరం చుట్టు పక్కల మరికొన్ని ఉన్నాయి. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలే మని అధికారులు చెబుతుండగా.. 10మంది లోపు విద్యార్థులున్న 153 సెక్షన్లు నడపడం ఆర్థికంగా తమకు భారమని, వారి కోసం సెక్షన్లు కొనసాగించలేమని కాలేజీలు చెబుతున్నాయి.  

ఒక్కో సెక్షన్‌లో ఐదుగురేనా? 
దాదాపు వంద కాలేజీలు ఈ సంవత్సరం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేశా యి. వీటిల్లో 78 కాలేజీల్లోని 9 వేలకు పైగా సీట్లు తగ్గించుకునేందుకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఒప్పుకున్నాయి. వాస్తవానికి ప్రతి సెక్షన్‌లో 60 మంది విద్యార్థులు చేరేందుకు అనుమతి ఉంటుంది. అయితే 58 కాలేజీల్లో కొన్ని సెక్షన్లలో పట్టుమని పది మంది కూడా చేరలేదు.

నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీల్లో సివిల్, మెకానికల్‌లో ఒక్కో సెక్షన్‌లో ఐదుగురే చేరారు. నగర శివార్లలోని నాలుగు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసే సీట్లు 78 వేల వరకూ ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు కౌన్సెలింగ్‌ ద్వారా 64 వేల మంది చేరినా, 59 వేల మందే ఫీజులు చెల్లించారు. ఈ లెక్కన 19 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆఖరుకు ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. 16 ప్రభుత్వ కాలేజీల్లో 5 వేల వరకూ సీట్లు ఉంటే, 3,800 మందే చేరారు.

కంప్యూటర్‌ కోర్సుల వల్లే: ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు కంప్యూటర్, ఐటీ, వాటి అనుబంధ కోర్సుల్లో చేరేందుకే సుముఖత చూపారు. ఈ మేరకు ఆయా విభాగాల్లో 9 వేలకుపైగా సీట్లు కూడా పెరిగాయి. 93% సీట్లు భర్తీ కూడా అయ్యాయి. ఇక మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ తదితర బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. సివిల్, మెకా నికల్‌ బ్రాంచీల్లో 10,286 సీట్లకుగాను 6,958, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో 18,825 సీట్లు ఉండగా 4,560 మిగిలాయి.

153 సెక్షన్లలో అయితే 10మందిలోపు మాత్రమే చేరారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు పదికి తక్కువగా చేరిన సెక్షన్లను రద్దు చేసి, ఆ విద్యార్థులను వేరే కాలేజీకి పంపే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో దీనిపై స్పష్టత రావొచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు