మహిళకు శస్త్ర చికిత్స, ఆ పై కాలం చెల్లిన మందులు ఇచ్చి..

15 Apr, 2021 10:20 IST|Sakshi

మితిమీరిన ప్రైవేట్‌ ఆస్పత్రుల ఆగడాలు

రోగికి కాలం చెల్లిన మందులు

ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాకం

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

సాక్షి, ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రుల ఆగడాలు మితిమీరుతున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేయడమే కాకుండా కాలం చెల్లిన మందులను అంటగట్టి పేషంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి అనుమతి లేనప్పటిట్లిటీవలి వరకు వైద్యం కొనసాగించారు. వైద్యులు లేకుండానే సిబ్బందే మందులు ఇచ్చిన వ్యవహారం కూడా బయటపడిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని తాంసి బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రోగికి కాలం చెల్లిన మందులు ఇవ్వడం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ మందులు వాడటంతో పేషంట్‌కు వాంతులు, విరేచనలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి 10గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇంద్రవెల్లి మండలం ఆంద్‌గూడకు చెందిన షెల్కే సావిత్రిబాయి గర్భసంచి ఆపరేషన్‌ కోసం జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈనెల 10న చేరింది. అదేరోజు సాయంత్రం ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. మందులతో పాటు ఆపరేషన్‌ ఖర్చు కోసం రూ. 30వేలు చెల్లించాలని వైద్యులు సూచించడంతో ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆమెకు ఓ పౌడర్‌ను ఇచ్చారు.

మధ్యాహ్నం విపరీతమైన వాంతులు, విరేచనాలు అయ్యాయని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. 2016 సంవత్సరానికి సంబంధించి కాలం చెల్లిన మందులు ఇచ్చారు. దీంతో డాక్టర్‌ను సంప్రదించగా.. క్షమించండి వేరే మందులు ఇస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మరో పౌడర్‌ ఇచ్చినప్పటికీ ఆ పౌడర్‌లు కూడా 2017, 2020కు సంబంధించినవి కావడంతో మెడికల్‌ షాపు వారితో వాగ్వాదానికి దిగారు. ఇవి మా ఇంట్లో తయారు కావని, కంపెనీ నుంచి వచ్చినవే ఇస్తున్నట్లు వైద్యులతో పాటు మెడికల్‌ సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. బాధితురాలి భర్త బలిరాం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓను వివరణ కోరగా తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చదవండి: హాస్టల్‌లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం

4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం

మరిన్ని వార్తలు