వసూలు చేసింది రూ.14.5 లక్షలు చేతికి రూ.1.91 లక్షల బిల్లు 

10 Aug, 2020 03:33 IST|Sakshi

మరో బాధితుడి నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి, రూ.5 లక్షలకే బిల్లు

మెడికల్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం పూర్తి బిల్లులు ఇవ్వాలని బాధితుల మొర

అలా కుదరదు.. జీవో మేరకు ఇచ్చామంటున్న ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

సికింద్రాబాద్‌ పాన్‌బజార్‌కు చెందిన ఓ వ్యక్తి(53) కోవిడ్‌తో బాధపడుతూ జూలై 24న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. హెల్త్‌కార్డుపై చికిత్సకు ఆస్పత్రి నిరాకరించింది. వైద్యులు రెండురోజులపాటు సాధారణ ఐసీయూలో ఉంచారు. 26వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు వెంటిలేటర్‌పై చికిత్స అందించగా అదేరోజు ఆయన చనిపోయారు. 12 రోజులకు రూ.14.50 లక్షల బిల్లు వసూలు చేశారు. ఇన్సూరెన్స్‌ సంస్థ నుంచి క్లెయిమ్‌ చేసుకునేందుకుగాను బిల్లు తాలూకు రశీదు ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరగా రూ.1,91,700 బిల్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నించగా, జీవో మేరకే బిల్లు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కువ మాట్లాడితే... మీ జువెలరీ షాప్‌పై ఐటీ దాడులు చేయిస్తామని ఆస్పత్రి యాజమాన్యం బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరిస్తుండటం గమనార్హం.  

నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి(68) కూడా కోవిడ్‌తో ఇటీవల ఇదే ఆస్పత్రిలో చేరారు. 18 రోజుల చికిత్సకు రూ.18 లక్షలు చెల్లించారు. డిటైల్డ్‌ బిల్లు ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులు కోరగా అలా ఇవ్వడం కుదరదని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం రశీదు ఇవ్వాలని కోరితే రూ.5 లక్షల బిల్లు ఇవ్వడంతో కుటుంబసభ్యులు విస్తుపోవాల్సి వచ్చింది. బోయినపల్లికి చెందిన ఓ ప్రముఖ బిల్డర్‌ కుటుంబసభ్యులు నలుగురు ఇటీవల కోవిడ్‌ బారిన పడి చికిత్స కోసం ఇదే ఆస్పత్రిలో చేరారు. ఇందులో బిల్డర్‌ తండ్రి కోవిడ్‌తో మృతి చెందగా... ముగ్గురు కోలుకున్నారు. కానీ వారికి అయిన బిల్లు చూస్తే షాక్‌ తప్పదు. రూ.50 లక్షలు చెల్లించగా వారికి ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన బిల్లు రూ.2 లక్షలే. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 79,495 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 45 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 627 మంది కోవిడ్‌తో మృతి చెందగా, వీరిలో 500 మందికిపైగా సిటిజనులే. ప్రభుత్వం ప్యాకేజీ నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావని కార్పొరేట్‌ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈహెచ్‌ఎస్, జీహెచ్‌ఎస్, సీహెచ్‌ఎస్, ఈఎస్‌ఐసహా ఇతర ప్రైవేటు సంస్థల ఇన్సూరెన్సులను కలిగినవారికి ఈ ప్యాకేజీలు వర్తించవని ప్రభుత్వమే స్పష్టం చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న యాజమాన్యాలు ఐసీయూ, వెంటిలేటర్‌ పడకలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి.  

రోగుల బలహీనత.. వారికి కాసులపంట 
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న రోగుల బలహీనతను ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. షరతులు విధిస్తున్నాయి. నగదు చెల్లించేందుకు అంగీకరించేవారికే అడ్మిషన్లు ఇస్తున్నాయి. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రోగి నుంచి రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ‘ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకుంటాం’పూర్తి బిల్లులకు రశీదులివ్వాలని కోరితే పలు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా డబ్బులు దండుకుంటున్న ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు