భారంగా బతుకు‘పాఠం’

21 Oct, 2020 01:19 IST|Sakshi

ఉపాధి కోల్పోయిన లక్షన్నర మంది ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులు

వ్యవసాయ కూలీలుగా మారిన గురువులు

ఆర్నెలలు గడిచినా... అదే పరిస్థితి

స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వారికీ అరకొర వేతనాలు, దినసరి కూలీనే

ప్రముఖ స్కూళ్లలోనూ అంతే... 40 శాతం సిబ్బందితోనే పనులు

ఫీజుల వసూలుకు, వారికిచ్చే సగం జీతాలకు లింకు

పై ఫోటోలో పత్తి ఏరుతున్న ఈయన పేరు లింగమయ్య. కల్వకుర్తికి చెందిన ఈయన ఎంఎస్సీ బీఈడీ చేశారు. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న లింగమయ్య.. కరోనా దెబ్బతో ఉద్యోగం కోల్పోయారు. సొంతూరుకు వెళ్లి జీవనోపాధి కోసం వ్యవసాయ కూలీగా మారారు. 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పో యిన లక్షన్నర మంది టీచర్లు, అధ్యాపకుల జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. 6 నెలలుగా పని లేక.. జీవనం గడిచే దారిలేక కొంత మంది వ్యవసాయ, దినసరి వేతన కూలీలుగా మారితే.. మరికొంతమందిపరువు కోసం కడుపు మాడ్చు కొని ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నారు. అర్ధాకలితో అవస్థలు పడుతూ ఎప్పుడు పరిస్థితులు చక్క బడుతాయో నని ఎదురుచూస్తున్నారు. ఇపుడు 75% స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగ తులను ప్రారంభించి, ఫీజులూ వసూలు చేసుకుంటున్నాయి. ఫీజులు చెల్లించని వారి పిల్లలకు ఆన్‌లైన్‌ యాక్సెస్‌ ఇవ్వకుండా వేధిస్తూ ఫీజులను పెంచి మరీ దండుకుంటున్నాయి. అయినా టీచర్లను స్కూళ్లకు రమ్మని పిలవడం లేదు. వెళ్లి అడిగినా పట్టించు కోవడం లేదు. చివ రకు గత విద్యా సంవత్సరపు వేతన బకాయి లను, కోత పెట్టినవేతనాలను చెల్లించడంలే దని, పీఎఫ్‌ డబ్బులు విడిపించు కునేందుకు అవకాశమివ్వట్లేదని వాపోతున్నారు.

మళ్లీ వస్తామన్నా... తీసుకొనే వారేరీ?
డిగ్రీ, పీజీలు, పీహెచ్‌డీలు చేసి పట్నం వచ్చి టీచర్లు, లెక్చరర్లుగా బతుకీడుస్తున్న అనేక మంది కరోనా వల్ల బతుకుదెరువు కోల్పోయారు. యాజమాన్యాలు జీతాలు ఇవ్వక, పట్టణాల్లోనే ఉండేందుకు డబ్బులు లేక, ఏదో ఒక పని చేసుకొని బతికేం దుకు ఏప్రిల్, మే నెలల్లోనే అనేక మంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు వెనక్కి వద్దామని యాజమాన్యాలను సంప్ర దిస్తున్నా... అటు నుంచి స్పందన లేదు. చివరకు సగం జీతానికైనా పనిచేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని, తామెలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. 

ఆన్‌లైన్‌ తరగతుల్లో 40 శాతం మందే..
విద్యాశాఖ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 10,912 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 1,27,790 మంది టీచర్లు పని చేస్తున్నారు. మరోవైపు 15 వేల మంది వరకు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇక 1,496 ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో 20 వేల మంది వరకు లెక్చరర్లు ఉన్నారు. మరోవైపు 187 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 90 వేల మందికి పైగా అధ్యాపకులు పని చేస్తున్నారు. అయితే వీరిలో ఇపుడు 40 శాతం మంది కూడా స్కూళ్లు, కాలేజీల్లో లేరు. మెజారిటీ స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించినా టీచర్లను వెనక్కి తిరిగి తీసుకోలేదు. 20–25 మంది టీచర్లు ఉన్న స్కూళ్లలో 10 మందిలోపు టీచర్లతోనే ఆన్‌లైన్‌ బోధనను కొనసాగిస్తున్నాయి. చాలా పాఠశాలలైతే ప్రైవేటు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకొని రికార్డెడ్‌ పాఠాలను ప్రసారం చేస్తున్నాయి. దీంతో వాటిని మానిటర్‌ చేసేందుకు ముగ్గురు నలుగురు టీచర్లను మాత్రమే స్కూళ్లకు రమ్మన్నాయి. అదీ సగం జీతాలతోనే పని చేయించుకుంటున్నాయి. మిగతా లక్షన్నర మందికి పైగా టీచర్లకైతే ఆ సగం జీతంతో కూడిన జీవితం కూడా లేకుండా పోయింది.

క్లాసుకు ఇంతని దినసరి కూలీ
స్కూళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్న వారి పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. చెప్పినా సగం జీతం కూడా ఇవ్వడం లేదు. వారికి వారంలో నాలుగు తరగతులను ఇచ్చి, ఒక్కో క్లాస్‌ రూ. 100 చొప్పున 400 చెల్లిస్తున్నారు. నెలకు రూ. 2 వేలు కూడా పొందని టీచర్లు అనేక మంది ఉన్నారు. మరోవైపు చాలా మంది టీచర్లకు స్కూళ్లు ఫీజుల వసూలు టార్గెట్లు పెట్టాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, ఫీజులు చెల్లించేలా చేస్తే ఒక్కో ట్రాన్‌జాక్షన్‌పై రూ. 300 చొప్పున కూలీగా చెల్లిస్తున్నాయి.

రూల్సా... లైట్‌ తీస్కో!
విద్యాశాఖ జీవో 1 ప్రకారం ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతం టీచర్ల వేతనాలకు, మరో 15 శాతం స్కూల్‌ అభివృద్ధికి, ఇంకో 15 శాతం పాఠశాల నిర్వహణకు, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చించాలి. మిగతా 5 శాతం డబ్బునే యాజమాన్యాలు లాభంగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అయినా విద్యాశాఖకు పట్టదు.


ఈమె పేరు లావణ్య. లాక్‌డౌన్‌ ముందు వరకు ఓ ప్రైవేటు స్కూళ్లో టీచర్‌. ఆమె భర్త కూడా ప్రైవేటు ఉద్యో గి. వీరికి ఇద్దరు పిల్లలు. చెరో ఉద్యోగం చేసుకుంటేనే ఇళ్లు గడిచే పరిస్థితి. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల స్కూల్‌ బంద్‌ అయింది. ఆమె ఉద్యోగం పోయింది. ఆర్నెల్లు అవుతోంది. భర్తకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది.

వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తున్నా: మహదేవ్‌
ఏప్రిల్‌ నుంచి జీతం లేదు. అడిగితే బెదిరిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామంటున్నారు. మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఉంది. మీ డాటా వాళ్లకు పంపించి మీకు ఎక్కడా పని దొరక్కుండా చేస్తామని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక వాటర్‌ ప్లాంట్లో పని చేస్తున్నా. 

మరిన్ని వార్తలు