తెలంగాణలో వ్యాక్సిన్‌ టెన్షన్‌!

11 May, 2021 02:27 IST|Sakshi
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం గుమిగూడిన జనం

రాష్ట్రవ్యాప్తంగా టీకా కేంద్రాల వద్ద జనం బారులు 

పలుచోట్ల తోపులాటలు..

గంటల తరబడి క్యూలైన్లు.. 

సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు 

పోలీసుల పహారాలో పంపిణీ..

నిల్వలు లేక చాలా మంది వెనక్కి..

సాక్షి, హైదరాబాద్‌: రెండో డోసు టీకా కోసం రాష్ట్రవ్యాప్తంగా జనం వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పోటెత్తారు. సోమవారం పొద్దున ఆరు గంటల నుంచే పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు. జనం పెరిగిపోవడం, తమ వరకు టీకా వస్తుందో లేదోనన్న ఆందో ళన కారణంగా పలుచోట్ల తోపులాటలు జరిగాయి. గంటల తరబడి క్యూలో నిలబడటంతో వృద్ధులు, మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి ఇలా ఉండటంతో పోలీసు పహారాలో టీకాలు వేయాల్సి వచ్చింది. అయితే వ్యాక్సిన్లు తక్కువగా ఉండటంతో వైద్య సిబ్బంది చేతులెత్తేశారు. చాలా మంది ఉసూరుమంటూ వెళ్లిపోవాల్సి వచ్చింది.  

తక్కువ కేంద్రాల్లోనే.. 
రాష్ట్రవ్యాప్తంగా 1,350 కేంద్రాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లు చేసిన వైద్యారోగ్య శాఖ.. పరిస్థితికి తగినట్టుగా కేంద్రాల సంఖ్యలో మార్పులు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం వెయ్యి కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో 45 ఏళ్లుదాటిన వారి కేటగిరీలో రెండో డోసు వారికి మాత్రమే టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కానీ రెండో డోసు వారికి సరిపడా కూడా వ్యాక్సిన్లు లేక ఇబ్బందులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీకల్లా సుమారు 5లక్షల మంది లబ్ధిదారులకు రెండో డోసు వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలి. కానీ ఆ మేర టీకాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. 


తోపులాట జరుగుతుండటంతో అడ్డుగా కట్టిన తాడు కింద నుంచి వెళుతున్న వృద్ధుడు  

టీకాల నిల్వలు రెండు లక్షల డోసులే..! 
ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ వద్ద కేవలం 2లక్షల డోసులు మాత్రమే నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం తీసుకున్నవారుపోగా.. ఇంకా నాలుగు లక్షల మందికి టీకా వేయాల్సి ఉందని అంచనా. రెండ్రోజుల తర్వాత లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. కానీ కేంద్రం నుంచి వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయన్నది తేలడం లేదు. వాస్తవానికి రెండో డోసు వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని, లబ్ధిదారులు నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వస్తే అప్పటికప్పుడు వివరాలు నమోదు చేసి టీకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. చాలాచోట్ల టీకా కేంద్రాలకు లబ్ధిదారులు బారులు తీరారు. అయితే ఒక్కో సెంటర్‌లో 100 నుంచి 150 మందికే వ్యాక్సిన్‌ వేశారు. మిగతావారిని తిప్పి పంపేశారు. దీనిపై జనం తీవ్రంగా మండిపడ్డారు. సకాలంలో టీకా తీసుకోకుంటే పనిచేస్తుందో లేదోనని ఆందోళన పడ్డారు. వైద్య సిబ్బంది సర్ది చెప్తున్నా వినకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ సెంటర్ల వద్ద తోపులాట, జనం ఆగ్రహం నేపథ్యంలో పలుచోట్ల పోలీసు పహారాలో వ్యాక్సినేషన్‌ కొనసాగించారు. 

ఏ వ్యాక్సిన్‌ ఎక్కడిస్తున్నారో తెలియక.. 
రాష్ట్రంలో ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ రెండు రకాల వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నారు. తొలి డోసు ఏ వ్యాక్సిన్‌ తీసుకుంటే.. రెండో డోసు అదే వ్యాక్సిన్‌ వేసుకోవాలి. అయితే ఏ సెంటర్‌లో ఏ వ్యాక్సిన్‌ వేస్తున్నారో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

ఉప్పల్‌ పీహెచ్‌సీలో తోపులాట 
అధికారుల సమన్వయ లోపం కారణంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పీహెచ్‌సీ టీకా కేంద్రం వద్ద సోమవారం తోపులాట జరిగింది. అప్పటికే జనం భారీగా గుమిగూడగా.. సిబ్బంది వచ్చి కోవాగ్జిన్‌ వారు రావాలని పిలవడంతో ఒక్కసారిగా వందలాది మంది గేటు ముందుకు దూసుకొచ్చారు. 45–59 మధ్య వయసువారితోపాటు వృద్ధులూ వారి లో ఉన్నారు. ఉదయం నుంచీ క్యూలైన్‌లో ఉండటంతో అలసిపోయిన ఒక వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడి జనం ఆమె ను లేపి నీళ్లు తాగించి కేంద్రంలోకి పంపారు. ఓవైపు టీకా కోసం, మరోవైపు కోవిడ్‌ పరీక్షల కోసం భారీగా జనం రావడంతో ఆస్పత్రి ప్రాం తం కిటకిటలాడింది. ఇక్కడా భౌతిక దూరం కనిపించలేదు. హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి. రెండో డోస్‌ టీకా కోసం ప్రజలు.. తెల్లవారుజాము నుంచే ఆస్పత్రి వద్ద బారులు తీరారు. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి.. పంపిణీ చేయాల్సి వచ్చింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ కో సం జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. భౌతి కదూరం వంటిదేమీ పాటించకుండా బారులు తీరారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో చాలా మంది ఇబ్బందిపడ్డారు.

రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఇదీ 
ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసులు    :    51,89,389 
మొదటిడోసు తీసుకున్నవారు    :    43,74,338 
రెండు డోసులు తీసుకున్నవారు     :    8,15,051 
ప్రస్తుతమున్న టీకా నిల్వలు    :    2 లక్షలు 

మరిన్ని వార్తలు