స్టాంప్‌ డ్యూటీకి ‘ఫ్రాంకింగ్‌’ తిప్పలు!

27 May, 2022 08:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్‌ శాఖలో ఫ్రాంకింగ్‌ మిషన్‌ సేవలు అందని ద్రాక్షగా తయారయ్యాయి. డిజిటలైజేషన్‌ సేవలను మరింత సులభతరం చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంప్‌ డ్యూటీ చెల్లించేందుకు ఫ్రాంకింగ్‌ మిషన్లు అందుబాటులో తెచ్చినప్పటికీ ఆచరణలో అమలు నిర్లక్ష్యానికి గురవుతోంది. పాత మిషన్లు మొరాయిస్తుండటంతో ఆధునిక యంత్రాల సరఫరా జరిగినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో వినియోగంలోకి తేవడం లేదు. కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో మొక్కుబడిగా పనిచేస్తుండగా, మరికొన్నింటిలో మూలన పడిపోయాయి. ఫలితంగా దస్తావేజుదారులు ప్రైవేటు ఫ్రాంకింగ్‌ మిషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. 

స్టాంప్‌ డ్యూటీ కడితేనే.. 
ఇళ్లు, వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ఇతర గుర్తింపు పొందిన ఫైనాన్స్‌ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 0.5 శాతం హైపోతిక్‌ చార్జీ (స్టాంప్‌ డ్యూటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించిన తర్వాతనే బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు రుణాన్ని విడుదల చేస్తాయి. రూ.1000 లోపు అయితే స్థానికంగా ఉండే లైసెన్స్‌డ్‌ స్టాంప్‌ వెండర్ల వద్ద చెల్లించవచ్చు. అంతకన్నా మించి అయితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్రాంకింగ్‌ మిషన్‌ ద్వారా ముట్టినట్టు స్టాంప్‌ వేసి ఇస్తారు. 

నిండా నిర్లక్ష్యం.. 
ఫ్రాంకింగ్‌ మిషన్‌లో డిపాజిట్‌ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దస్తావేజుదారులు ఆరోపిస్తున్నారు. చిన్న డిజిటల్‌ యంత్రమైన ఫ్రాంకింగ్‌ మిషన్‌ను ఎప్పటికప్పుడు రీచార్జి చేయించాల్సి ఉంటుంది. రూ.20 లక్షలను ప్రభుత్వానికి ముందస్తుగా డిపాజిట్‌ చేస్తే అంత విలువైన స్టాంపుల స్టాంపింగ్‌కు కావాల్సిన ముడిసరుకును (ఇంక్‌) సరఫరా అవుతోంది. అయిపోతే మళ్లీ చార్జీ చేసుకోవాలి. ప్రైవేటు స్టాంప్‌ వెండర్ల విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఆయితే  వారి దగ్గర రూ. వెయ్యికి మించి స్టాంపింగ్‌కు వీలు లేదు. రిజిస్ట్రేషన్‌ అధికారులు మిషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే మరమ్మతు చేయించకపోవడమే కాకుండా రీచార్జి చేయించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న  విమర్శలు  వినవస్తున్నాయి. 

ఆదాయం సమకూరుతున్నా.. 
ప్రస్తుతం రూ.100 మించిన స్టాంపులను అమ్మడం లేదు. స్టాంప్‌ డ్యూటీకి సరిపడా స్టాంపులను కొనుగోలు చేయడం కష్టమవుతోంది. ఆ మొత్తాన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చెల్లిస్తే అందుకు సరిసమానమైన స్టాంప్‌ను ఈ ఫ్రాంకింగ్‌ మిషన్‌ ద్వారా వేస్తారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు రుణాలు ఇస్తుంటాయి. ఈ రుణాల మంజూరుకు ప్రభుత్వానికి స్టాంప్‌ డ్యూటీ కింద నెలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ అవసరమైన ఫ్రాంకింగ్‌ మిషన్ల నిర్వహణపై శ్రద్ధ కనబర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

(చదవండి: ‘స్పీడ్‌’ రూల్స్‌ ఇక పక్కా!)

మరిన్ని వార్తలు