తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌పై వేటు 

31 Oct, 2021 02:19 IST|Sakshi
తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, సభ్యులు  

కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి నియామకం 

అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలు రద్దు చేస్తున్నట్లు వీసీ ప్రకటన 

‘సాక్షి’ కథనాలపై చర్చ 

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. శనివారం ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ 5 గంటలపాటు పాలకమండలి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ కనకయ్యను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్‌ యాదగిరిని నియమించారు. పదేళ్ల అనుభవం అవసరమైన సీనియర్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు కేవలం ఐదేళ్ల అనుభవం ఉన్న కనకయ్య తనకు తానే ఆర్డర్‌లు ఇచ్చుకుని, పాలకమండలి అప్రూవల్‌ అయినట్లుగా ప్రకటించుకొని యూజీసీ నిబంధనలను అతిక్రమించారని నవీన్‌ మిట్టల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్లికేషన్‌ చూపించమని అడిగినా కనకయ్య చూపించలేకపోయారు. దీంతో కనకయ్య సీనియర్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అనర్హుడని నవీన్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు. కనకయ్యపై క్రమశిక్షణ చర్యల కోసం అప్పటికప్పుడే ఛార్జ్‌ మెమో తయారు చేశారు. అక్కడికక్కడే ప్రొ.యాదగిరికి రిజిస్ట్రార్‌గా ఛార్జ్‌ ఇప్పించి కనకయ్యను సమావేశం నుంచి బయటకు పంపించారు. అదేవిధంగా సీనియారిటీ లేని యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ నాగరాజును కూడా పాలకమండలి సమావేశం నుంచి నవీన్‌ మిట్టల్‌ బయటకు పంపారు. గత నెలలో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో చేపట్టిన 113 మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్లు వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు.

బోధన సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో అన్నిరకాల డిప్యుటేషన్లను రద్దు చేసి అందరినీ వెనక్కు పిలవాలని మిట్టల్‌ ఆదేశించారు. నవంబర్‌ 1 నుంచి టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి బయోమెట్రిక్‌ కచ్చితంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నవంబర్‌ 27న హైదరాబాద్‌లో మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, ప్రమోషన్లు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ వ్యవహారాలపై ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలను కొందరు పాలకమండలి సభ్యులు బుక్‌లెట్‌ రూపంలో నవీన్‌ మిట్టల్‌కు అందించగా వీటిపై చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు