మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్‌ మరి!

27 Feb, 2022 08:52 IST|Sakshi

సాక్షి,సిరిసిల్లఅర్బన్‌: టిఫిన్‌ కావాలంటే ఇప్పుడు హోటళ్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు స్వచ్ఛమైన, రుచికరమైన వేడి, వేడి టిఫిన్‌ ప్రస్తుతం మోబైల్‌ వాహనం రూపంలో అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా జనసంచారం ఉన్న ప్రధాన కూడళ్లలో మొబైల్‌ టిఫిన్‌ సెంటర్ల ద్వారా అందిస్తున్నారు.  కేవలం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ సెంటర్‌లో దోసా, ఇడ్లీ, వడ, బోండా, పూరి నిమిషాల్లో తయారు చేసి వేడి, వేడిగా అల్లం చట్నీతో అందిస్తున్నారు. రుచి, శుచికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వినియోగదారులు వీటి వద్ద క్యూ కడుతున్నారు. ప్రజాదరణ పెరగడంతో వీటి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

రహదారులే అడ్డాలుగా.. 
జిల్లా కేంద్రంలో విద్యానగర్, రగుడు, కొత్త చెరువు, బస్టాండ్, పెద్దూరు తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులను అడ్డాలుగా చేసుకొని చిరువ్యాపారులు మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లను నడిపిస్తున్నారు. వీటికి అద్దె చెల్లించడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో హోటళ్లలో ఉండే ధరల కంటే తక్కువ ధరలకే టిఫిన్స్‌ అందిస్తున్నారు. 

నిరుద్యోగులకు ఉపాధి
మోబైల్‌ టిఫిన్‌ సెంటర్ల వ్యాపారం నిరుద్యోగులకు వరంలా మారింది. నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగానే ఉండడంతో వీటి ఆధారంగా రోజుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తున్నారు. వీరు జీవనోపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు.  

ఐదేళ్లుగా నడుపుతున్నా
మాది తంగళ్లపల్లి గ్రామం. దాదాపు ఐదేళ్లుగా మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ని నడిపిస్తున్నా. సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులో విద్యానగర్‌ చౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపి ఉంచుతా. నాతో పాటు మరో ఇద్దరం దీని వల్ల ఉపాధి పొందుతున్నాం. – తలగోప్పుల రాజు, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు   

నాణ్యతకే ప్రాధాన్యత
స్వచ్ఛమైన, రుచికరమైన టిఫిన్స్‌ అందించడంతో  ఆదరణ పెరుగుతోంది. అలాగే హోటళ్లలో కంటే తక్కువ ధరకు అందిస్తున్నాం. వాహనదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆగి మరి తిని వెళ్తుంటారు. 
– మనోహార్, సిరిసిల్ల, మొబైల్‌ సెంటర్‌ నిర్వాహకుడు

రుచికరంగా ఉంటుంది
కొత్త చెరువు వద్ద ఒక మోబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ ఉదయం అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు రుచికరంగా అందిస్తుండడంతో వాహనదారులు, వ్యాపారులు ఇక్కడే టిఫిన్‌ చేసి వెళ్లారు. నిర్వాహకులు అల్పాహరాన్ని రుచితో పాటు శుచి, శుభ్రత పాటిస్తున్నారు.
– సందవేణి శ్రీనివాస్, సిరిసిల్ల

మరిన్ని వార్తలు