మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి వెల్లడి

31 Jan, 2021 20:43 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 20 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, ఇందుకు తగ్గట్టుగా  పని చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డిలు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉద్యోగుల పదోన్నతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులను ఆయా ఉద్యోగులకు అందించారు. రాష్ట్రం ఏర్పడ్డాక లక్షా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. 

పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేయాలని మంత్రులు కోరారు. ఖజానా డబ్బులన్ని ఉద్యోగుల జీతాల పెంపుకే ఇచ్చారన్న భావన ప్రజల్లో  కలగకుండా పీఆర్సీని పెంచుకుందమని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల డిమాండ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, న్యాయ బద్దమైన పీఆర్‌సీ వచ్చేలా తాము కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవో 2021 డైరీ, క్యాలెండర్లను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు