అర్హులైన టీచర్లకు మెసేజ్‌లు పంపండి: మంత్రి సబిత 

1 Sep, 2023 04:21 IST|Sakshi

బదిలీల్లో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు

బదిలీలపై తక్షణమే విధివిధానాలు రూపొందించాలి

సాక్షి, హైదరాబాద్‌: టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బదిలీకి అర్హత గల ప్రతి ఉపాధ్యాయుడికీ బదిలీల సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపాలని ఆదేశించారు. 

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్సీఈఅర్టీ కార్యాలయంలో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఆన్‌లైన్‌ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. 

పదోన్నతుల తర్వాత ఖాళీల భర్తీ 
పదోన్నతులు, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) పూర్తయిన తర్వాత విద్యాశాఖలో ఉండే ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని సమావేశానంతరం మంత్రి మీడియాకు తెలిపారు. టీచర్‌ పోస్టుల భర్తీకి కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్, ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ పోస్టులను, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయతి్నస్తున్నదని, ఈ సమయంలో అన్ని పారీ్టలు, అన్ని వర్గాలు సహకరించాలని మంత్రి కోరారు. 

ఇది కూడా చదవండి: నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు

మరిన్ని వార్తలు