20 దాకా ఆస్తుల నమోదు

11 Oct, 2020 02:12 IST|Sakshi

గడువు 10 రోజులు పొడిగింపు

జీహెచ్‌ఎంసీలో 50 శాతం మహిళా కోటాకు చట్టబద్ధత

ప్రతిసారీ డివిజన్ల రిజర్వేషన్‌ రొటేషన్‌కు చెల్లు.. ఇకపై రెండు పర్యాయాలకు ఒకసారి మార్పు

‘ధరణి’ ద్వారా నాలా దరఖాస్తులు

కొత్త రిజిస్ట్రేషన్ల చట్టానికి మార్పులు 

రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గడువును ఈ నెల 20 వరకు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శనివారంతో గడువు ముగిసిపోగా మరో 10 రోజులు పొడిగిం చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చట్టానికి ప్రతిపాదించిన పలు కీలక సవరణలను మంత్రివర్గం ఆమోదిం చింది. జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించడంతో పాటు డివిజన్‌ కమిటీల పనివిధానం, డివిజన్ల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే అమలులో ఉన్న 50 శాతం మహిళల కోటాకు చట్టబద్ధత కల్పించాలనే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ప్రతి ఐదేళ్లకోసారి డివిజన్ల రిజర్వేషన్లు రొటేషన్‌ పద్ధతితో మారుతున్నాయి. ఇకమీదట రెండు పర్యాయాలకు (పదేళ్లకు) ఒకసారి డివిజన్ల రిజర్వేషన్లు మారుతాయి.

జీహెచ్‌ఎంసీకి సంబంధించిన ఈ రెండు అంశాలతో పాటు ఇతర బిల్లులను మంగళ, బుధవారాల్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదింపచేసుకోనుంది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం పొందుపర్చింది. భూవినియోగ మార్పిడి కోసం ధరణి పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించడానికి నాలా చట్టానికి సవరణలు జరపాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త రిజిస్ట్రేషన్‌ చట్టానికి స్వల్ప మార్పులతో సవరణలను జరపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్రమంత్రివర్గం ఈ మేరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. హెచ్‌ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విధానంపై మంత్రివర్గం చర్చించింది. 

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు
కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాలల్లోనే ధాన్యం సేకరణ చేసినట్టు., ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరణ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా సమసిపోనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా, గత అనుభవాలను దృష్టిలోఉంచుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరపాలని కేబినెట్‌ సమావేశం నిర్ణయించింది. దీనికి 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఎన్నిరోజులైనా వీటిని నడిపి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని తమ తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని కోరింది. కాగా, ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా చూసుకుని, తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతాంగాన్ని కోరింది. 

మక్కల సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి    
యాసంగిలో మొక్కజొన్న సాగుపై కేబినెట్‌ చర్చించింది. దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయమని అభిప్రాయపడింది. కేంద్రం నిర్ణయాలతో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి ఏర్పడటంపై కేబినెట్‌ ఆవేదన వ్యక్త చేసింది. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలున్నప్పటికీ... మన రైతుల ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాలనుంచి మక్కలు దిగుమతి చేసుకోవాలనే కేంద్రం ఆలోచన పట్ల కేబినెట్‌ విస్మయం వ్యక్తం చేసింది. విశ్వవిపణిలో మొక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి ఉండటం, కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో... మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరింది.

మరిన్ని వార్తలు