ట్రూఅప్‌ చార్జీలు.. రూ.12,015 కోట్లు! 

18 Dec, 2022 01:54 IST|Sakshi

ఈఆర్సీకి ప్రతిపాదించిన డిస్కంలు 

రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్‌ 

ట్రూఅప్‌ చార్జీల వసూళ్లకు గత ఆగస్టులో ప్రతిపాదనలు

దీంతో రూ.16,167 కోట్లకు పెరిగిన మొత్తం ట్రూఅప్‌ చార్జీల భారం 

2023–24లో ప్రస్తుత చార్జీల కొనసాగింపునకే డిస్కంల టారిఫ్‌ ప్రతిపాదనలు 

బహిరంగ విచారణ నిర్వహించి నిర్ణయం తీసుకోనున్న ఈఆర్సీ 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ వినియోగదారుల నుంచి రూ.12,015 కోట్ల విద్యుత్‌ కొనుగోలు ట్రూఅప్‌ చార్జీల వసూలుకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌/టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌)లు శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆరీ్స)కి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్‌ కొనుగోలు వ్యయం, వాస్తవ వ్యయం మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్‌రంగ పరిభాషలో పవర్‌ పర్చేజ్‌ ట్రూఅప్‌ చార్జీలు అంటారు. 2016–17 నుంచి 2022–23 మధ్యలోని ఏడేళ్ల కాలానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్‌ కొనుగోళ్ల వ్యయంతో పోలిస్తే వాస్తవ వ్యయం రూ.29,212 కోట్లు అధికంగా ఉందని తమ పిటిషన్లలో ఉత్తర/దక్షిణ డిస్కంలు పేర్కొన్నాయి. పెరిగిన వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మేరకు వ్యత్యాసం ఉందని తెలిపాయి.

 డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయం కింద రూ.7,961 కోట్లు, నష్టాల సర్దుబాటు రూ.9,236 కోట్లను అందించింది. ఈ మొత్తాలు పోను మిగిలిన రూ.12,015 కోట్లను విద్యుత్‌ కొనుగోలు ట్రూఅప్‌ చార్జీల రూపంలో వసూలుకు ఈఆర్సీ అనుమతి కోరాయి. ఈ మేరకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ రూ.9,060.80 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌ రూ.2,954.66 కోట్ల పవర్‌ పర్చేజ్‌ ట్రూఅప్‌ చార్జీల వసూళ్లకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. టీఎస్‌ఈఆర్సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు శనివారం తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.

చార్జీల పెంపు లేదంటూ ప్రతిపాదనలు.. ఆపై ట్రూఅప్‌ చార్జీల వడ్డన..
వచ్చే ఆర్థిక సంవత్సరం 2023–24లో రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ చార్జీలనే కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆరీ్స)కి సమర్పించిన వార్షిక టారీఫ్‌ ప్రతిపాదనల్లో కోరాయి. రూ.12,015 కోట్ల పవర్‌ పర్చేజ్‌ ట్రూప్‌ చార్జీల వసూళ్ల కోసం తాజాగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ రెండు ప్రతిపాదనలపై నిర్దేశిత గడువులోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈఆర్సీ ఆహ్వానించనుంది. తర్వాత ప్రజాభిప్రాయసేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహించనుంది. వీటికి సంబంధించిన తేదీలను త్వరలో ఈఆర్సీ ప్రకటించనుంది. అనంతరం 2023–24 కి సంబంధించిన విద్యుత్‌ టారీఫ్‌ ఉత్తర్వులను ప్రకటించనుంది. ప్రతిపాదిత పవర్‌ పర్చేజ్‌ ట్రూఅప్‌ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలపై మరో ఉత్తర్వులు జారీ చేయనుంది. 
        
ట్రూఅప్‌ చార్జీల భారం రూ.16,107 కోట్లు
2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి సంబంధించి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్‌ ట్రూఅప్‌ చార్జీల వసూలుకు గత ఆగస్టు 18న ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. తాజాగా ప్రతిపాదించిన రూ.12,015 కోట్ల పవర్‌ పర్చేజ్‌ ట్రూప్‌ చార్జీలను కలుపుకుంటే డిస్కంలు ప్రతిపాదించిన మొత్తం ట్రూఅప్‌ చార్జీలు రూ.16,107 కోట్లకు పెరగనున్నాయి. ఇవేకాక జనరేషన్‌ ట్రూఅప్‌ కింద మొత్తం రూ.500 కోట్లకుపైగా చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ జెన్‌కో, సింగరేణి సంస్థలు సైతం వేర్వేరు పిటిషన్లు వేశాయి. 

వినియోగదారులపై ట్రూఅప్‌ గండం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రూ.5,986 కోట్ల విద్యుత్‌ చార్జీలను డిస్కంలు పెంచిన విషయం తెలిసిందే. ట్రూఅప్‌ చార్జీలకు ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఆ భారం పడనుంది. డిస్ట్రిబ్యూషన్‌ ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనలపై జనవరి 18న ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. మార్చి నుంచి క్షేత్ర స్థాయిలో తనిఖీలు వ్యవసాయ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి వీలుగా వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు తప్పనిసరిగా మీటర్లు బిగించాలని ఈఆర్సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు స్పష్టం చేశారు. మార్చి నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.  

డిస్ట్రిబ్యూషన్‌ ట్రూఅప్‌ చార్జీలు అంటే?
విద్యుత్‌ కొనుగోళ్ల వ్యయం కాకుండా విని యోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అయ్యే అన్ని రకాల వ్యయాలను కలిపి డిస్ట్రిబ్యూషన్‌ వ్యయం అంటారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్‌ లైన్లు, సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు (ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు), ఆదాయంపై పన్నులు, తరుగుదల, మూలధనంపై రాబడి, ఇతర ఖర్చులు వంటివి ఉంటాయి. ముందస్తుగా డిస్ట్రిబ్యూషన్‌ వ్యయ అంచనాలను ఈఆర్సీ ఆమోదిస్తుంది. దానికి తగినట్టుగా బిల్లుల వసూలుకు అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనాల కంటే డిస్ట్రిబ్యూషన్‌ వ్యయం పెరిగితే.. ఆ మేరకు ట్రూఅప్‌ చార్జీల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యయం తగ్గితే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని ట్రూడౌన్‌ అంటారు.

>
మరిన్ని వార్తలు