సాక్షి, వీణవంక(కరీంనగర్): మండలంలోని చల్లూరు, ఎల్బాక గ్రామాల్లో బుధవారం దళితులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బొమ్మతో కూడిన గోడ గడియారాలను పగలగొట్టి నిరసన తెలిపారు. మండలానికి చెందిన బీజేపీ నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బొమ్మతో ఉన్న గోడ గడియారాలను ఇటీవల మండల వ్యాప్తంగా పంపిణీ చేశారు. దళితులను ఈటల పట్టించుకోలేదని, గడియారాలు తమకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరాడని, ప్రజలకు రూ.90 విలువగల గడియారాలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తే ఎవరూ లొంగరని అన్నారు. ఆత్మగౌరవం అంటూ చెప్పుకునే ఈటల దళితులపై ఎప్పుడూ స్పందించలేదని పేర్కొన్నారు. ఇకనైనా ప్రలోభాలకు గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. దళితబంధు పథకంతో దళితుల ఆర్థిక సాధికారత చేకూరుతుందని పేర్కొన్నారు.