ప్రభుత్వం దిగొచ్చేవరకూ పోరు 

16 Feb, 2021 02:43 IST|Sakshi
సోమవారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం 

ప్రకృతి సంపదను కాజేసేందుకు కార్పొరేట్‌ శక్తుల కుట్ర 

దేశంలో రైతు అభిప్రాయానికి స్థానం లేకుండాపోయింది 

రైతుగర్జన సభలో ఢిల్లీ రైతు ఉద్యమనేత ఆశీష్‌ మిట్టల్

సాక్షి, ఖమ్మం ‌: వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనం చేసే చట్టాలను రద్దు చేసే వరకూ పోరాడుతామని ఢిల్లీ రైతు ఉద్యమ నేత, ఏఐకేఎంఎస్‌ జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ ఆశీష్‌ మిట్టల్‌ అన్నారు. రైతువ్యతిరేక చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని, కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో సోమవారం సాయంత్రం రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పెవిలియన్‌ మైదానంలో జరిగిన రైతుగర్జన సభలో ఆయన మాట్లాడుతూ పంజాబ్, హరియాణా రైతులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభు త్వం కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేసి ప్రకృతి సంపదను కాజేసేందుకు కుట్ర చేస్తోం దని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తుంటే.. వారిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా నిలిచిందన్నారు. పంట వేసే నాటి నుంచి పం డిన పంటను అమ్ముకునే వరకు కార్పొరేట్‌ కంపెనీలు చెప్పింది చేసేలా చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆహారభద్రతకు తూట్లు పొడిచే విధంగా చట్టాలు ఉన్నాయని, రైతుల అభిప్రాయాలను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

జల్, జంగిల్, జమీన్‌ హక్కుల కోసం రైతులంతా పోరాడాలని పిలుపునిచ్చారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ పోరాటం చేయకపోతే తమకు భవిష్యత్తు లేకుండా పోతుం దనే ఆవేదనతో రైతులు పోరుబాట పట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తుంటే ఊరుకోలేక మూడు నెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానంతో భవిష్యత్తులో ప్రజలకు తిండి దొరకకుండాపోయే ప్రమాదముందని అన్నారు. మనమంతా రైతులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. సభలో ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, నాయకులు చలపతిరావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు