అంతరిక్షంలో డబ్బుల కుప్ప.. 72 లక్షల కోట్ల కోట్లు..!

8 Aug, 2021 03:01 IST|Sakshi

మనకు రెండెకరాలో, మూడెకరాలో భూమి ఉంది.. అందులో ఏ బంగారమో, ప్లాటినమో దొరికితే.. అమ్మో డబ్బులే డబ్బులు.. కోట్లకుకోట్లు వస్తాయి అంటారు కదా.. మరి అంతరిక్షంలో తిరుగుతున్న ‘సైకీ’ అనే ఓ గ్రహశకలాన్ని భూమికి తెచ్చేసుకుంటే ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా.. 72 లక్షల కోట్ల కోట్లు. 72 పక్కన 19 సున్నాలు పెట్టినంత డబ్బు. ఎప్పుడో ఒకప్పుడు ఆ గ్రహ శకలాన్ని తవ్వి తెచ్చుకుందామని శాస్త్రవేత్తలు ప్లాన్‌ చేస్తున్నారు. మరి సైకీ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?    –సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

ఈ ఆస్టరాయిడ్‌.. ఎంతో చిత్రం 
సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల మధ్యలో ఆస్టరాయిడ్‌ బెల్ట్‌ ఉంది. ఇతర గ్రహాల తరహాలోనే అక్కడి కొన్ని లక్షల ఆస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. వాటిలో ఒకటి ఈ సైకీ. మామూలుగా ఆస్టరాయిడ్లు అంటే కొన్ని మీటర్ల నుంచి ఐదో, పదో కిలోమీటర్ల పెద్దవి దాకా ఉంటాయి. కానీ సైకీ ఆస్టరాయిడ్‌ చాలా పెద్దది. దీని వ్యాసం రెండు వందల కిలోమీటర్లు. అంటే మన చందమామ పరిమాణంలో సుమారు 15వ వంతు ఉంటుంది. భూమికి సైకీకి మధ్య దూరం సుమారు 37 కోట్ల కిలోమీటర్లు. 

‘సైకీ’ అంటే ఆత్మ దేవత! 
ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్‌ గస్పారిస్‌ 1852లోనే ఈ ఆస్టరాయిడ్‌ను తొలిసారిగా గుర్తించారు. గ్రీకుల ‘ఆత్మ’ దేవత ‘సైకీ’ పేరును దానికి పెట్టారు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి వ్యోమనౌకను పంపుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. 

ఏమిటి దీని ప్రత్యేకత? 
సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఏవైనా రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ మాత్రం చాలా వరకు లోహాలతో కూడి ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేథరిన్‌ డిక్లీర్‌ చెప్పారు. దానిపై ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సైకీపై ఉన్న లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్కిన్స్‌ టాంటన్‌ అంచనా వేశారు. 

ఇది ఓ పెద్ద గ్రహం మధ్యభాగమా? 
సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలోని ఓ గ్రహం మధ్యభాగమే (కోర్‌) ఈ ఆస్టరాయిడ్‌ అని అంచనా వేస్తున్నారు. సాధారణంగా గ్రహాలు ఏర్పడినప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ సమయంలో బరువుగా ఉండే ఇనుము, ఇతర లోహాలు ద్రవస్థితిలో గ్రహం మధ్యభాగం (కోర్‌)లోకి చేరుతాయి. మన భూమి, అంగారకుడు, ఇతర గ్రహాల మధ్యభాగంలో కొన్ని వందల కిలోమీటర్ల మేర లోహాలు ఉంటాయి. అలాంటి ఓ గ్రహం వేరే గ్రహాన్నో, భారీ ఆస్టరాయిడ్‌నో ఢీకొని ముక్కలై ఉంటుందని.. దాని మధ్యభాగమే ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిని పరిశీలించడం ద్వారా గ్రహాలు ఏర్పడినప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చని, కోర్‌ ఎలా ఏర్పడుతుంది, ఏమేం ఉంటాయన్నది గుర్తించవచ్చని అంటున్నారు. 

వచ్చే ఏడాదే వ్యోమనౌక ప్రయాణం 
సైకీ ఆస్టరాయిడ్‌పై విస్తృతంగా పరిశోధన చేయడం కోసం నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకను పంపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో అమెరికాలోని ఫ్లారిడా నుంచి ఈ ‘సైకీ స్పేస్‌క్రాఫ్ట్‌’ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది సుమారు మూడున్నరేళ్లు ప్రయాణించి 2026లో సైకీని చేరుకుంటుంది. రెండేళ్లపాటు దానిచుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. 

మరిన్ని వార్తలు