ఒత్తిడే శత్రువు.. స్థూలంగా మూడే రకాలు.. ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’

ప్రధానంగా సామాజిక, ఆర్థిక ఒత్తిళ్లతో మానసిక సమస్యలు

బాల్యంలోని అనుభవాలతో మానసిక ఆరోగ్యంపై ప్రభావం

కొన్నిసార్లు జన్యువులతో వారసత్వంగానూ వచ్చే అవకాశం

ఎక్కువ మంది బాధపడుతున్నది యాంగ్జైటీ డిజార్డర్లతో..

మూడ్‌ డిజార్డర్లు, స్కీజోఫ్రీనియాతో విపరీతమైన ప్రవర్తన

తగిన చికిత్స తీసుకోకుంటే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం

కంచర్ల యాదగిరిరెడ్డి
వెర్రి వేయి విధాలు అంటుంటారు. అది ఇది ఒకటి కాకపోయినా మానసిక సమస్యల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి. అంతేకాదు మానసిక సమస్యలు ఫలానా వారికే వస్తాయి. ఫలానా వారికి రావన్న మాటే ఉండదని.. ప్రాంతం, జాతి, స్త్రీ, పురుషులు, వయసు, ఆదాయం వంటి వాటన్నింటికీ అతీతంగా ఎవరికైనా రావొచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని.. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయని వివరిస్తున్నారు.

ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చెడిపోయేందుకు దోహదపడే అంశాల్లో.. మొట్టమొదట చెప్పుకోవాల్సింది సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లు! మార్కులు బాగా రావాలని పిల్లలను డిమాండ్‌ చేయడం, మిత్రుడిలా విలాసవంతమైన కారు కొనుక్కోవాలన్న విపరీతమైన తపన వంటివి సామాజిక ఒత్తిళ్ల కోవకు వస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు.

అవసరానికి తగిన డబ్బులు ఉండటం బాగుంటుందిగానీ లేనప్పుడే సమస్య. సమాజంలో ఆర్థికంగా అడుగున ఉన్నవారు మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. 2015లో ఇరాన్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పేదరికంలో, వెలివాడలు లేదా ఊరికి దూరంగా ఉండటం వంటివి మానసిక ఆరోగ్యం దెబ్బతినేందుకు అవకాశం కల్పిస్తాయి. మరో అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ.

బాల్యంలోని అనుభవాలతో..
వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో బాల్యానిది కీలకమైన పాత్ర అని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు విస్పష్టంగా చెప్పాయి. చిన్నతనంలో శారీరక, మానసిక, లైంగిక హింసను ఎదుర్కోవడం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోవడం లేదా విడిపోవడం, తల్లిదండ్రుల్లో ఎవరైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటం వంటివి పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ అంశాలు కొన్నిసార్లు సైకోటిక్‌ సమస్యలకు దారితీస్తే.. మరికొన్నిసార్లు పీటీఎస్‌డీ (పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌)కు కారణం కావచ్చని పేర్కొంటున్నాయి.

జన్యువుల పాత్ర కూడా..
మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. కుటుంబంలో నిర్దిష్ట జన్యువుల్లో మార్పులు కొనసాగుతూంటే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుమార్పులకు మరికొన్ని అంశాలు కూడా తోడైనప్పుడు అవి వ్యాధులుగా పరిణమించే అవకాశం ఉంటుంది.

స్పష్టంగా చెప్పాలంటే.. ఏదైనా మానసిక సమస్యకు కారణమయ్యే జన్యువులు మనలో ఉన్నా అది తీవ్రమైన సమస్యగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా సామాజిక శాస్త్రాల విభాగం 2019 నాటి అధ్యయనంలో పేర్కొంది. ఇక ఇలాంటి నిర్దిష్ట జన్యువులు ఉన్నా, లేకున్నా మానసిక సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. ఇదే సమయంలో కేన్సర్, మధుమేహం, తీవ్రమైన నొప్పి వంటి శారీరక సమస్యలు మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చని వివరించింది.

స్థూలంగా మూడే..
ముందుగా చెప్పుకున్నట్టు మానసిక సమస్యల సంఖ్య పెద్దదే అయినా.. కొన్ని సాధారణ లక్షణాలున్న వాటన్నింటినీ కలిపి ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’ డిజార్డర్లు అనే మూడు రకాలుగా విభజించారు.

►ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైన మానసిక సమస్య యాంగ్జైటీ డిజార్డర్‌. దీనికి లోనైన బాధితుల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని వస్తువుల విషయంలో విపరీతమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తప్పించుకునేందుకు వారు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. యాంగ్జైటీ డిజార్డర్‌లో.. సాధారణ యాంగ్జైటీ డిజార్డర్‌తోపాటు ప్యానిక్‌ డిజార్డర్, ఫోబియాలు, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ), పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ) వంటివి ఉంటాయి.

►మూడ్‌ డిజార్డర్ల విషయానికి వస్తే.. వీటిని డిప్రెసివ్‌ లేదా అఫెక్టివ్‌ వ్యాధులని కూడా పిలుస్తారు. వీటిలో బాధితుల మనోస్థితి తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. విపరీతమైన ఆనందం లేదా దుఖం, కోపం వంటి ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. మూడ్‌ డిజార్డర్లలో.. మనోవ్యాకులత, బైపోలార్‌ డిజార్డర్, సీజనల్‌ అఫెక్టివ్‌ డిజార్డర్లు ఉంటాయి.

►స్కీజోఫ్రీనియా డిజార్డర్ల గురించి చెప్పాలంటే.. కొంచెం సంక్లిష్టమైన మానసిక సమస్యలన్నీ ఈ కోవకు చెందినవని చెప్పొచ్చు. సాధారణంగా ఈ రకమైన మానసిక సమస్యలు 16– 30 ఏళ్ల మధ్య వయసు లోనే వృద్ధి చెందుతాయి. ఆలోచనలు కుదురుగా ఉండకపోవడం స్కీజోఫ్రీనియా లక్షణాల్లో ఒకటి. చిత్త భ్రమ, పలవరింత, నిస్పృహ వంటివీ దీని లక్షణాలే. 

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు