జ్ఞాపకశక్తిపైనా.. కరోనా పంజా

25 Jun, 2021 08:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాగా గుర్తున్న వాటిలో ఏదో ఒకటి జ్ఞాపకం ఉండట్లేదన్న 80 శాతం మంది

ఏదైనా విషయం లేదా జరిగిన ఘటనను మరిచిపోతున్నామన్న 55 శాతం మంది

మహిళలపై మరింత ప్రభావం పడినట్టు వెల్లడి

బ్రిటిష్‌ మెమొరీ పరిశోధకురాలు కేథరీన్‌ అధ్యయనంలో వెలుగులోకి..

కోవిడ్‌ మహమ్మారి జ్ఞాపకశక్తి పైనా పంజా విసురుతోంది. దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ప్రభావితం చేస్తూనే ఉంది. మహమ్మారి కారణంగా తలెత్తిన పరిణామాలు, మార్పులతో ఊహ తెలిశాక రోజువారీ జీవన విధానంలో కొన్నేళ్లుగా పాటిస్తున్న ఒక ‘టైం టేబుల్‌’కు భిన్నంగా వ్యవహరించాల్సి రావడం, కొత్త లక్షణాలు, భయాలతో వచ్చిన అంతుచిక్కని వ్యాధి మస్తిష్కాలను, ఆలోచనలను మార్చివేసింది. కోవిడ్‌ వస్తుందేమోనన్న భయాలు, ఆందోళనలు మెదళ్లను, ఆలోచన తీరును ఎంతగానో ప్రభావితం చేసినట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్లతో బంధువులు, మిత్రులు, సహోద్యోగులు, తదితరులను ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడంతో మనుషుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినడం వంటివి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం  చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, హైదరాబాద్‌

ఇదీ అధ్యయనం...
సంఘ జీవిగా ఉన్న మనిషి తన సహజ ప్రవృత్తికి భిన్నంగా సామాజిక సంబంధాలను కొనసాగించలేకపోవడం మెదడుపై, ఆలోచనల తీరు, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతున్నట్టు వెస్ట్‌మినిస్టర్‌ యూనివర్సిటీ కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొ.కేథరీన్‌ లవ్‌ డే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కేథరీన్‌ తన పరిశోధనలో.. ఎవరికైనా ఏదైనా చెబుదామనుకుని మరిచిపోయారా?, చదివిన పుస్తకాన్నే మళ్లీ చదువుతున్నారా? వంటి అంశాలతో ‘ప్రతిరోజు జ్ఞాపకశక్తి ప్రశ్నావళి’ ద్వారా వివిధ విషయాలపై పలువురి నుంచి సమాధానాలు రాబట్టారు. తాము బాగా గుర్తుంచుకున్న విషయాల్లో ఏదో ఒక భాగాన్ని మరిచిపోతున్నట్టు ఈ అధ్యయనంలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏదో ఒక ఘటన లేదా చేయాల్సిన పనిని మరిచిపోతున్నట్లు 55 శాతం మంది వెల్లడించారు.

మహమ్మారి కారణంగా తలెత్తిన పరిణామాలతో మెదడు పనితీరు, ఆలోచనలు కూడా ఏదో ఒకరూపంలో ప్రభావితమైనట్లు 30 శాతం మంది పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితుల ప్రభావం మహిళలపై మరింత ఎక్కువగా పడినట్లు, పురుషులతో పోల్చితే వారి జ్ఞాపకశక్తి ఎక్కువ తగ్గినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కాగా, కోవిడ్‌ మహమ్మారి  మనుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సైకాలజిస్ట్‌ విశేష్‌ పేర్కొన్నారు. ఆప్తులతో మనసారా మాట్లాడలేకపోవడం, అభిప్రాయాలు, ఆలోచనల మార్పిడి లేకపోవడంతో వ్యక్తిత్వం, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం మనుషుల   మానసిక, శారీరక ఆరోగ్యాలపై సుదీర్ఘకాలం పాటు ఉంటుందని వివరించారు. 
 

మరిన్ని వార్తలు