2015లో రోడ్డు పక్కన.. 2022లో కుటుంబ సభ్యులతో ఇలా.. 

17 Jan, 2022 09:40 IST|Sakshi
2015లో రోడ్డు పక్కన... 2022లో కుటుంబ సభ్యులతో మహిళ..

2015లో నగరానికి చేరుకున్న బెంగళూరు వివాహిత 

సైకోసిస్‌ వ్యాధితో వివరాలు చెప్పలేని స్థితిలో దీనంగా 

చేరదీసిన మదర్‌ థెరిస్సా చారిటీ సంస్థ నిర్వాహకులు 

ప్రత్యేక చికిత్స అందించిన ప్రొఫెసర్‌ అనిత రాయిరాల 

ఎట్టకేలకు కోలుకోవడంతో కుటుంబీకుల చెంతకు 

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకకు చెందిన వివాహిత (58) సైకోసిస్‌ అనే మానసిక వ్యాధి బారినపడి  కుటుంబానికి దూరమైంది. అనాథగా సికింద్రాబాద్‌ వీధుల్లో సంచరిస్తున్న ఆమెను మదర్‌ థెరిస్సా చారిటీ సంస్థ అక్కున చేర్చుకుంది. ఆమె పరిస్థితి చూసి, చలించిన మానసిక వైద్యురాలు డాక్టర్‌ అనిత రాయిరాల ఏడాదిగా ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశారు. ఎట్టకేలకు కోలుకున్న ఆమె తన వివరాలు చెప్పడంతో శనివారం సికింద్రాబాద్‌లోని చారిటీ కార్యాలయంలో వారికి అప్పగించారు. సరైన వైద్యం అందిస్తే ఎంతో మంది మానసిక రోగులు బాగయ్యే అవకాశం ఉందని డాక్టర్‌ అనిత వ్యాఖ్యానించారు.  

బెంగళూరుకు చెందిన వివాహితకు ఐదుగురు సంతానం. ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె ఓపక్క తన కుటుంబాన్ని చూసుకుంటూ.. మరోపక్క చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెప్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది.  
ఆమెకు 49 ఏళ్ల వయస్సులో సైకోసిస్‌ అనే మానసిక వ్యాధి బారినపడింది. దీని ప్రభావంతో ఏం చేస్తోందో, ఏం మాట్లాడుతోందో కూడా తెలియని స్థితికి చేరుకుంది. అయినప్పటికీ కుటుంబీకులు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు.  
రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈమెను అతికష్టమ్మీద పట్టుకున్నారు. అయితే 2015లో ఇంటిని వదిలిన ఈ వివాహిత రైలులో సికింద్రాబాద్‌కు చేరుకుంది. ఈమె ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన కుటుంబీకులు అక్కడి పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.  

చదవండి: (మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..)

సికింద్రాబాద్‌కు చేరుకున్న వివాహిత ఫుట్‌పాత్‌పై దిక్కులేని దానిలా కొన్నాళ్లు గడిపింది. రోడ్డుపై ఏది దొరికితే అది తింటూ బతికింది. ఈమెను చూసిన ఓ వ్యక్తి మదర్‌ థెరిస్సా చారిటీ సంస్థకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన నిర్వాహకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. 
నీడ, తిండి, బట్ట ఇవ్వడంతో పాటు వైద్యం చేయించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్‌ అనిత రాయిరాల సామాజిక సేవలో భాగంగా ఈ సంస్థకు వెళ్లి అక్కడి వారికి వైద్యం చేస్తుంటారు. అలా దాదాపు ఏడాది క్రితం ఈమె కళ్లల్లో ఆ వివాహిత పడ్డారు. 
ఆమెను చూసిన తొలి రోజే సరైన వైద్యం చేస్తే మామూలు స్థితికి చేరుకుంటుందని భావించారు. ఏడాది పాటు ప్రత్యేక చికిత్స చేసిన డాక్టర్‌ అనిత ఆ వివాహిత మామూలు స్థితికి చేరుకునేలా చేశారు. ఆమె మాట్లాడుతున్నది కన్నడగా భావించిన డాక్టర్‌... ఆ భాష తెలిసిన తన స్నేహితులతో మాట్లాడించారు. 

అలా ఆమె నుంచి బెంగళూరులోని కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. చారిటీ నిర్వాహకుల సహకారంతో అక్కడి స్థానికి పోలీసులను సంప్రదించి ఆమె కుటుంబాన్ని గుర్తించారు. వారితో ఫోన్‌లో సంప్రదించి, వివాహిత ఫొటో పంపి ఖరారు చేసుకున్నారు. 
శనివారం నగరానికి చేరుకున్న ఆమె భర్త, కుమార్తె, అల్లుడు సికింద్రాబాద్‌లోని చారిటీ కార్యాలయంలో వివాహితను చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. చారిటీ నిర్వాహకులు ఆమెకు కుటుంబానికి అప్పగించారు. ఇక జీవితంలో చూడలేమని భావించిన తన భార్యను తిరిగి అప్పగించిన మదర్‌ థెరిస్సా చారిటీ సంస్థకు, ఆమెను మామూలు మనిషిని చేసిన డాక్టర్‌ అనితకు కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు