ఆస్పత్రులకు పరుగెత్తొద్దు..

29 Apr, 2021 01:32 IST|Sakshi

పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌ రెడ్డి సూచన 

లక్షణాలు లేకున్నా టెస్టుల కోసం ఎగబడొద్దు 

ఆక్సిజన్, బెడ్స్‌ కొరత లేదు..  

విషమ పరిస్థితుల నుంచి బయటపడుతున్నాం

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా విషమ పరిస్థితుల నుంచి బయటపడుతున్నామని, కేసుల్లో స్థిరత్వం వస్తోందని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు, వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పారు. మే నెలాఖరు వరకు జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా బయటపడతామని.. కేసులు తగ్గుతున్నాయని అలసత్వం వహిస్తే మళ్లీ తిరగబెడుతుందని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బెడ్స్‌కు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదని, అనవసర ఆందోళన వీడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవడం, సాధారణంగా మందులతో తగ్గిపోయేదానికి భయంతో ఆస్పత్రులకు పరుగెత్తడం మానుకోవాలని సూచించారు. 85 నుంచి 90 శాతం కరోనా బాధితులు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. డాక్టర్ల సూచనలతో బయటపడొచ్చని తెలిపారు. 

లక్షణాలు ఉంటేనే టెస్టులకు.. 
లక్షణాలు లేకుండా కోవిడ్‌ టెస్ట్‌లకు వెళ్తే.. అక్కడున్న వారితో కరోనా సోకే ప్రమాదం ఉందని శ్రీనివాసరావు హెచ్చరించారు. కళ్లలో మంట, ఎర్రబడటం, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షల కోసం వెళ్లాలన్నారు. లక్షణాలు లేకున్నా టెస్టులకు వెళ్లడం, అవసరం లేకున్నా ఆస్పత్రుల్లో చేరడం వల్లే.. టెస్టు కిట్లు, బెడ్లకు కొరత ఏర్పడుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 108 అంబులెన్సులు 450 ఉంటే.. వాటిలో 150 కేవలం కోవిడ్‌ బాధితుల కోసం ఉపయోగిస్తున్నామని శ్రీనివాసరావు వివరించారు. 108 వాహనాల్లో వెళ్తే దగ్గర్లో ఎక్కడ బెడ్స్‌ ఉంటే ఆ ఆస్పత్రికి బాధితులను తీసుకెళ్తాయని తెలిపారు. కరోనా బాధితులు సలహాలు, సూచనల కోసం 104 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఫిర్యాదులకు 91541 70960 నంబర్‌కు వాట్సాప్‌ చేయవచ్చని వివరించారు. రాష్ట్రంలో టెస్టులు ఎందుకు తగ్గాయన్న ప్రశ్నకు శ్రీనివాసరావు స్పందిస్తూ.. దేశంలో రోజుకు కేవలం 17 లక్షల కిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని, కిట్ల లభ్యత ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

చివరి నిమిషంలో రావడంతోనే మరణాలు 
గాంధీ, టిమ్స్, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రులకు రోగులు పరిస్థితి విషమించిన తర్వాతే వస్తుండటంతో.. ఆ ఆస్పత్రుల్లో మరణాలు కనిపిస్తున్నాయని వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పారు. వైద్య సిబ్బంది ఏడాదిన్నరగా విరామం లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదన్నారు. బెడ్స్‌ కోసం దూరంలో ఉండే కార్పొరేట్‌ ఆస్పత్రుల దాకా వెళ్లకుండా.. దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మందులు ఉన్నాయన్నారు. రోగులు జిల్లా ఆస్పత్రుల నుంచి అనవసరంగా హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్, వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రులకు రావొద్దని.. ఇక్కడ చేసే చికిత్సనే జిల్లా ఆస్పత్రుల్లోనూ ఉంటుందని వివరించారు. అనవసరంగా ఆస్పత్రుల్లో ఉంటూ ఆక్సిజన్‌ పెట్టుకోవడం క్రిమినల్‌ వేస్టేజీ అని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు