మూడు కోట్ల డోస్‌లు

22 Oct, 2021 02:59 IST|Sakshi

దేశంలో 12వ స్థానం

రాష్ట్రవ్యాప్తంగా 76% మందికి మొదటి డోస్, 30% మందికి రెండో డోస్‌ 

త్వరలో 12–18 ఏళ్ల వారికి టీకాలు 

టీకా తీసుకోని 18 ఏళ్ల లోపువారు కరోనా బారిన పడుతున్నారు 

ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావుతో  ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకా కార్యక్రమంలో రాష్ట్రం మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల డోస్‌లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన వారందరికీ పూర్తిస్థాయిలో రెండు డోస్‌లూ వేసేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సిన్లు వేయడమే కీలకమైన అంశమని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

టీకాలు వేయడంలో తెలంగాణ దేశంలో 12వ స్థానంలో నిలిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వంద కోట్ల డోస్‌లు, అందులో భాగంగా రాష్ట్రంలో మూడు కోట్ల డోస్‌లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..

జీహెచ్‌ఎంసీలో 100% మొదటి డోస్‌
రాష్ట్రంలో మూడు కోట్ల డోస్‌ల వ్యాక్సిన్లు వేశాం. 18 ఏళ్లు పైబడిన 2.77 కోట్ల మందికి కరోనా టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.10 కోట్ల మందికి మొదటి డోస్‌ వేయగా, మిగిలినవారికి రెండో డోస్‌ కూడా వేశాం. మొదట్లో వ్యాక్సిన్‌ కొరత ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాం. మొదటి దశలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా అందించాం. ఆ తర్వాత రెండో దశలో 60 ఏళ్లు పైబడినవారికి, 45 ఏళ్లుపై బడిన దీర్ఘకాలిక వ్యక్తులకు ఇచ్చాం.

ఇక మూడో దశలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఇస్తూ వచ్చాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొదటి డోస్‌ నూటికి నూరు శాతం వేశాం. రెండో డోస్‌ 50 శాతం పూర్తయింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76 శాతం మందికి మొదటి డోస్, 30% మందికి సెకండ్‌ డోస్‌ వేశాం. అయితే మొదటి డోస్‌ వేసుకున్న వారిలో 36 లక్షల మందికి రెండో డోస్‌ పెండింగ్‌లో ఉంది. వారందరికీ వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళిక రచించాం.

కరోనా తగ్గిందనుకోవడం సరికాదు
రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించాం. వేసుకున్న ఇళ్లకు స్టిక్కర్‌ వేశాం. మొబైల్‌ వ్యాన్లు పెట్టి వేగవంతం చేశాం. వ్యాక్సిన్‌ వేసుకున్నవారు మాస్క్‌ పెట్టుకోవడం వల్ల కొత్త వేరియంట్లకు గురికాకుండా కాపాడుకోవచ్చు. కొందరు వ్యాక్సిన్‌పై వ్యతిరేకతతో వేసుకోవడంలేదు. మొదటి డోస్‌ వేసుకున్నవారిలో రెండో డోస్‌ తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కరోనా తగ్గుముఖం పట్టిందన్న భావనే. కానీ ఇది సరైన పద్ధతి కాదు.

టీకా క్రతువులో 38 వేల మంది సిబ్బంది
కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో రాష్ట్రంలో 38 వేల మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందులో 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 8 వేల మంది ఏఎన్‌ఎంలు, 5 వేల మంది ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది కూడా పాల్గొన్నారు. వారు ఎంతో చురుగ్గా పాల్గొనడం వల్లే వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోంది.

అందుకే మూడు కోట్ల డోస్‌లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ చేతుల మీదుగా సిబ్బందికి జ్ఞాపికలు అందజేయాలని నిర్ణయించాం.

కోవాగ్జిన్‌ సర్టిఫికెట్‌ ఉన్నా ఇబ్బందులు! 
కోవాగ్జిన్‌ టీకా వేసుకున్నవారిని అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాలు గుర్తించడం లేదు. ఆ వ్యాక్సిన్‌ వేసుకొని సర్టిఫికెట్‌ తీసుకెళితే అంగీకరించడంలేదు. ఈ విషయమై ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో కేంద్ర ప్రభుత్వం, భారత్‌ బయోటెక్‌ సంప్రదింపులు జరుపుతున్నాయి.

ఈ నెల 26వ తేదీన డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహించే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అందులో సమస్య పరిష్కారం కావొచ్చు. ఆ మేరకు అవసరమైన సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓకు కేంద్రం అందజేసింది.

ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది..
కరోనా వైరస్‌ వల్ల ఇంకా ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. కరోనా బారిన పడటం, ఆసుపత్రిలో చేరాల్సి రావడం, క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, దురదృష్టవశాత్తు మరణాలు సంభవించడం చూస్తున్నాం. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో విపరీత పరిణామాలు ఉండటం లేదు. కరోనా అంతం కాలేదనే విషయం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాలి. పూర్తిగా వ్యక్తుల అజాగ్రత్త వల్లనే వైరస్‌ వ్యాపిస్తుందనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించి మసలుకోవాలి.

అందరూ కలిసేందుకు అవకాశం ఉండే పండుగలు, వివాహ, వినోద కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఈ రోజుకూ రాష్ట్రంలో అటుఇటుగా రెండొందల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అది కూడా వ్యాక్సిన్‌ తీసుకోని 18 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా చూస్తున్నాం. అలాగే కుటుంబంలో ఒకరికి వస్తే త్వరితగతిన మిగతా అందరికీ వ్యాపించి కుటుంబం మొత్తం వైరస్‌ బారినపడుతున్నారు.

పిల్లలకు మూడు డోసుల టీకా
ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరుకు 18 ఏళ్లు పైబడినవారందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని నిర్ణయించాం. ఇక రెండు మూడు వారాల్లో 12–18 ఏళ్ల వయస్సు పిల్లలకు టీకా వేస్తాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక టీకా కంపెనీకి అనుమతి ఇచ్చింది. పిల్లలకు మూడు డోస్‌లు వేయాల్సి ఉంటుంది. నెల విరామంతో ఈ డోస్‌లు వేస్తారు. అలా రెండు నెలల వ్యవధిలో పిల్లలకు మూడు డోస్‌లు పూర్తవుతాయి. రాష్ట్రంలో 2–18 ఏళ్లలోపు పిల్లలు కోటి మంది ఉంటారు. తొలుత 12–18 ఏళ్ల వయస్సు పిల్లలకు టీకా వేస్తాం.

సర్టిఫికెట్‌ రాకుంటే ఇలా చేయండి
రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్నా కొందరికి సర్టిఫికెట్‌ రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే అన్నీ సక్రమంగా ఉంటే సర్టిఫికెట్‌ తప్పకుండా వస్తుంది. కొందరు మొబైల్‌ నంబర్‌ సరిగా ఇవ్వకపోవడం, సమాచారం సరిగా అందజేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయినా అలాంటి వారు వ్యాక్సిన్‌ వేసుకున్న కేంద్రంలో వెరిఫై చేసుకోవాలి. అక్కడి వివరాలను ఆధారంగా చేసుకొని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి వెళితే రెండు వారాల్లోగా సర్టిఫికెట్‌ సంబంధిత వ్యక్తుల మొబైల్‌కు పంపిస్తారు.

మరిన్ని వార్తలు