‘పాలమూరు–రంగారెడ్డి’పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం

11 Aug, 2021 02:51 IST|Sakshi
మంగళవారం నారాయణపేటలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రైతులు, ప్రజలు

ప్రతి కేంద్రం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండోదశలో చేపట్టే పనులకు పర్యావరణ అనుమతులపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ, మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ, నారాయణపేటలో కార్యక్రమం జరిగింది. ముందుగా అధికారులు ప్రాజెక్టు అవశ్యకత, లాభాలు, వ్యయాల వం టివి ప్రొజెక్టర్‌ ద్వారా రైతులకు వివరించారు.

అనంతరం వారి అభిప్రాయాలు స్వీకరించారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీచేసి అనుమ తించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోనికి అనుమతించలేదు. ప్రతి కేంద్రం వద్ద 200 నుంచి 300 మంది పోలీసులు మోహరించారు. వెల్దండలో కలెక్టర్‌ శర్మన్‌ అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 8 మండలాల రైతులు పాల్గొన్నారు. తమకు పర్యావరణంపై అవగాహన లేదని, నష్టపరిహారంపైనే ఆందోళన ఉందని రైతులు చెప్పారు. నారాయణపేటలో కలెక్టర్‌ దాసరి హరిచందన అధ్యక్షతన 9 మండలాల రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతుల పేర్లను చిట్టీల్లో రాసి డిప్‌తీస్తూ ఒక్కొక్కరితో మాట్లాడించారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారి పేర్లే తీశారనే ఆరోపణలొచ్చాయి. 

మరిన్ని వార్తలు