వారే ఎక్కువగా వైరస్‌ ప్రభావానికి గురవుతారు

15 Dec, 2021 01:20 IST|Sakshi

వెంటనే వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి 

ఒక్కడోస్‌ ఇమ్యూనిటీ 30%లోపే! 

‘సాక్షి’తో పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ వీవీ రమణప్రసాద్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా తీవ్రతను నిరోధించడంలో టీకాల పాత్ర కీలకం కాబట్టి ఇవి అస్సలు తీసుకోనివారు, ఇంకా ఇవ్వని 18 ఏళ్లలోపు పిల్లలు, 86 రోజుల వ్యవధి దాటినా రెండోడోస్‌ టీకా వేయించుకోనివారు ఈసారి ఎక్కువగా వైరస్‌ ప్రభావానికి గురయ్యే అవకాశాలున్నాయి’ అని కిమ్స్‌ ఆస్పత్రి పల్మనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వీవీ రమణప్రసాద్‌ చెప్పారు.

వీరందరికీ వెంటనే టీకాలు వేయాలని సూచించారు. ఇప్పటికైతే సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టే అనిపిస్తోందని, వచ్చే రెండునెలలు మరింత అప్రమత్తత అవసరమని డాక్టర్‌ రమణప్రసాద్‌ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ‘సాక్షి’ఇంటర్వ్యూలో డాక్టర్‌ రమణప్రసాద్‌ వివరించారు. ముఖ్యాంశాలు.. 

ప్రశ్న: ఒక్క డోస్‌తో రక్షణ ఎంత ? 
డా.రమణ: భారత్‌లో రెండు టీకాలు తీసుకున్నవారు 20–25 శాతంలోపే ఉన్నారు. ఒక్క డోస్‌ తీసుకున్నాక ఇక తమకేమి కాదన్న ధీమాతో చాలామందే ఉన్నారు. రెండు టీకాల మధ్య వ్యవధి పెరిగే కొద్ది మొదటి దాని నుంచి వచ్చే రక్షణ కూడా క్రమంగా తగ్గిపోతుంది. వాస్తవానికి ఒక్కడోస్‌తో వచ్చే రోగనిరోధకశక్తి 30 శాతం లోపే. రెండోది వేసుకుంటేనే టీ–సెల్స్, యాంటీబాడీస్‌ సంఖ్య బాగా పెరుగుతుంది. సెకండ్‌డోస్‌ తీసుకున్నాకే పూర్తి ఇమ్యూనిటీ వస్తుంది.  

ప్రశ్న : కొత్త వేరియెంట్లతో ప్రమాదమా ? 
డా.రమణ: ఎక్కువ తీవ్రత, ప్రభావం చూపేలా ఒమిక్రాన్‌లో మరో స్ట్రెయిన్‌ లేదా వైరస్‌ మరో కొత్త వేరియెంట్‌ వస్తే ప్రమాదకరమే. గతంలో కూడా ఐరోపా, యూఎస్, యూకే తదితర దేశాల్లో కోవిడ్‌ తీవ్రంగా ఉంది, మన దగ్గర లేదని భావించాం. ఐతే కొంతకాలానికే పరిస్థితి తలకిందులై సెకండ్‌వేవ్‌తో భారత్‌ తీవ్రమైన సంక్షోభానికి గురైంది. విదేశాల నుంచి డెల్టా కాస్తా డెల్టాప్లస్‌గా మారి ఇక్కడికి వచ్చాక సమస్య తీవ్రమైంది. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి. తీవ్రమైన లక్షణాలతో కొత్త మ్యుటేషన్‌ వస్తే మళ్లీ పెద్ద సమస్యగా మారుతుంది. 

ప్రశ్న: దేశంలో ప్రస్తుత స్థితిని ఎలా అంచనా వేస్తారు?
డా.రమణ: ఇప్పటికైతే సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టే అనిపిస్తోంది. వచ్చే రెండునెలలు మరింత అప్రమత్తత అవసరం. ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లలో కూడా జనవరిలో కేసుల పెరుగుదల మొదలై మార్చి, ఏప్రిల్‌ వరకు కొనసాగింది. అందువల్ల ఇప్పుడు వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా అంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 

ప్రశ్న: పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? 
డా.రమణ: ఈసారి పిల్లలతోనే కరోనా తీవ్రత పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు టీకా తీసుకోనివారికి, పిల్లలకు, రెండోడోస్‌ అవసరమైనవారికి వెంటనే వ్యాక్సిన్లు వేయడం మొదలుపెట్టాలి. ఆ తర్వాతే మిగతావారికి మూడో/బూస్టర్‌ డోసులు వేయాలి. పిల్లలు వైరస్‌ కారియర్లుగా ఇతరులకు వ్యాపింపజేస్తారు.  

మరిన్ని వార్తలు