పప్పులు.. కుప్పలు తెప్పలు

23 Feb, 2022 02:12 IST|Sakshi

రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న పప్పు ధాన్యాల ఉత్పత్తి  

ఐదేళ్ల కిందటితో పోలిస్తే 2020–21లో 1.28 లక్షల టన్నులు అధికం 

దేశంలో 9వ స్థానంలో తెలంగాణ 

ఈ సీజన్‌లో కంది, శనగ కొనుగోలుకు కేంద్రం ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తి ఏడాదికేడాది పెరుగుతోంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే 2020– 21లో 1.28 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి పెరిగింది. 2016 –17లో 5.36 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020–21లో 6.64 లక్షలకు చేరుకుంది. మొత్తంగా 2020–21లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. ఇటీవలి కేంద్రం నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

అత్యధికంగా రాజస్తాన్‌ రాష్ట్రంలో 48.21 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్‌లో 43.64 లక్షల టన్నులు, మహారాష్ట్రలో 42.24 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 11.85 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో 2016–17లో 2.31 కోట్ల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి కాగా 2020–21లో 2.55 కోట్లకు పెరిగాయి.  

ఉత్పత్తి పెంచే కార్యాచరణతో.. 
పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక కార్యా చరణను అమలు చేస్తోంది. విత్తనాల పంపిణీ, అధిక దిగుబడినిచ్చే రకాలు, వ్యవసాయ యంత్రాలు, నీటి ఆదా పరికరాలు, మొక్కల రక్షణ రసాయనాలు, పోషకాల నిర్వహణ, నేల మెరుగుదల, రైతులకు శిక్షణ చేపట్టింది. దేశంలో ఆయా రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో 150 సీడ్‌ హబ్‌లు ఏర్పాటయ్యాయి.

బీహార్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 2018–19 నుంచి చెరకులో పప్పు ధాన్యాల అంతర పంట అనే కొత్త పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహిస్తుండటంతో మున్ముందు ఈ పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది.  

కంది, శనగ కొనుగోలుకు ఏర్పాట్లు 
రాష్ట్రంలో ఈ వానాకాలంలో 4.67 లక్షల మెట్రిక్‌ టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. మద్దతు ధరకు 80,142 మెట్రిక్‌ టన్నులు కొనేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు 103 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్‌ నిర్ణయించిం ది. అందులో 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటా మద్దతు ధర రూ. 6,300 కాగా బహిరంగ మార్కెట్లోనూ ఇంతే ధర ఉందని, దీంతో కేంద్రాలకు రైతులు రావట్లే దని మార్క్‌ఫెడ్‌వర్గాలు అంటున్నాయి.

కేంద్రం 58,485 మెట్రిక్‌ టన్నుల శనగ కొనాలని నిర్ణయించడంతో వాటి కోసం కూడా మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది. 38 కేంద్రాలు గుర్తించి ఇప్పటికే 18 తెరిచామని మార్క్‌ఫెడ్‌ పంటల సేకరణ విభాగం ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ తెలిపారు. మద్దతు ధర క్వింటాకు రూ. 5,230 ఉంది.   

మరిన్ని వార్తలు