పున్నమి భవనానికి ఆధ్యాత్మిక హంగులు

13 Dec, 2022 04:30 IST|Sakshi
రీ ఎలివేషన్‌ అనంతరం... టూరిజం హోటల్‌ నమూనా చిత్రం. (ఇన్‌సెట్‌లో) ప్రస్తుత హరిత హోటల్‌  

సీఎం ఆదేశాలతో ‘రీ ఎలివేషన్‌’ పనులు ప్రారంభం

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలోని పున్నమి భవనం (హరిత హోటల్‌) ఆధ్యాత్మిక సొబగులతో త్వరలోనే భక్తులను ఆకర్షించనుంది. దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు, సూచనల మేరకు ‘రీ ఎలివేషన్‌’పనులు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 2001 ఫిబ్రవరి 4న అప్పటి టూరిజం శాఖ మంత్రి పెద్దిరెడ్డి.. పున్నమి గెస్ట్‌హౌజ్‌ను ప్రారంభించారు.

ప్రస్తుతం యాదాద్రీశుడి హుండీ లెక్కింపునకు దీనినే వినియోగిస్తున్నారు. ప్రధానాలయం అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్‌ పలుమార్లు ఈ హోటల్‌లోనే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. హోటల్‌ను సైతం ఆధ్యాత్మిక రూపాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో గతనెల 18న యాదాద్రి పర్యటనకు వచ్చిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఇందుకు సంబంధించిన నమూనాలను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, కలెక్టర్‌ పమేలా సత్పతి, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

పలు నమూనాలను సీఎం వద్దకు తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ ఫైనల్‌ చేసిన నేపథ్యంలో ఈఓ గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆచార్యులు, అధికారులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ‘రీ ఎలివేషన్‌’పనులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ఆహ్లాదపరిచే గ్రీనరీ, ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెన్లు, వాటర్‌ ఫౌంటెయిన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు